బస్తీ దవాఖానలకు సుస్తీ
- తెరుచుకోని తలుపులు.. తప్పని పడిగాపులు
పట్టణ పేదలకు అందని ప్రభుత్వ వైద్యసేవలు
అందుబాటులో ఉండని వైద్యులు, సిబ్బంది
అలంకారప్రాయంగా మారిన బస్తీ దవాఖానలు
ఎల్బీనగర్, జూన్ 30 : గత ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలో అందుబాటులోకి తెచ్చిన బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. పట్టణ పేదలకు ప్రాథమిక వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. జ్వరం, దగ్గు వస్తే ప్రైవేట్ దవాఖానకు పరిగెత్తి జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పేదలకు ఉచితం వైద్యం అందించే ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రభుత్వం బస్తీ దవాఖాలను ఏర్పాటు చేసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో పలుచోట్ల అవి మూతపడ్డాయి. కొన్నిచోట్ల వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే తెరుచుకుంటున్నాయి. ఫలితంగా మహిళలు, వృద్ధులకు కనీస వైద్యం అందని దుస్థితి నెలకొన్నది.
అన్ని సౌకర్యాలతో..
పట్టణాల్లోని పేదలకు వైద్య సదుపాయం అందించేందుకు బస్తీ దవాఖాన (హెల్త్ అండ్ వెల్‌న్నెస్ సెంటర్) లను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బస్తీదవాఖానలు పట్టణ పేదల కోసం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. వీటిని మురికివాడలు, కార్మికవాడల్లో ఏర్పాటు చేశారు. ప్రతి బస్తీదవాఖానకు మెడికల్ ఆఫీసర్, స్టాఫ్‌నర్స్, సపోర్టు స్టాఫ్‌ను కేటాయించారు. ఇక్కడ ఉచితంగా కన్సల్టేషన్, రోగనిర్దారణ, మందుల పంపిణీ, ప్రసూతి సంరక్షణ, రక్తహీనత పరీక్షలు, బీపీ, షుగర్, క్యాన్సర్ ఆరోగ్య పరీక్షలు చేస్తారు.
ఔట్‌రిచ్ సేవలు, కౌన్సిలింగ్, వ్యాధినిరోధక కార్యక్రమాలు (వ్యాక్సినేషన్), కుటుంబ నియంత్రణ, ఎన్‌సీడీ స్క్రీనింగ్ సేవలతో పాటు యూపీహెచ్‌ఎస్‌లో లభించే మందులు, చిన్నచిన్న శస్త్ర చికిత్సకు అవసరమైన పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. బస్తీ దవాఖానలను ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని వీరన్నగుట్ట, మన్సూరాబాద్, భూపేష్‌గుప్తానగర్, హస్తినాపురం, హయత్‌నగర్ ఖల్సా, చంపాపేట, సరూర్‌నగర్ ప్రాంతాల్లో బస్తీదవాఖానలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ బస్తీదవాఖానలు ప్రతిరోజూ మూసే ఉంటున్నాయి. వైద్యం కోసం వచ్చే ప్రజలు నిరాశ వెనుదిరిపోతున్నారు. ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు.
బస్తీ దవాఖానలో సేవలు..
ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 7 వరకు ఔట్‌పేషంట్ సేవలు, 200 రకాల వ్యాధి నిర్దారణ పరీక్షలు, 145 రకాల మందుల పంపిణీ, సాధారణ జ్వరం, దగ్గు, షుగర్, బీపీతో పాటు ఇతర వ్యాధులకు వైద్యసేవలు, గర్భిణులకు 9 నెలల పాటు ఆరోగ్య పరీక్షలు, కాల్షియం, ఐరన్ మాత్రల పంపిణీ, థైరాయిడ్ సమస్యలు, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ, ప్రతి బుధ, శనివారాల్లో చిన్నారులకు వ్యాక్సిన్లు ఇలా 57 రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి.
వైద్య పరీక్షలు సైతం ఉచితమే
బస్తీ దవాఖానల్లో బీపీ, షుగర్, రక్తహీనత పరీక్షలు, మూత్ర పరీక్షలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధి నిర్దారణ, రక్తగ్రూపు నిర్దారణ, ర్యాపిడ్ టెస్టులతో పాటు దాదాపుగా 57 రకాల వైద్యపరీక్షలు ఉచితంగా చేస్తారు. ఆన్‌లైన్‌లో వైద్యపరీక్షల ఫలితాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, టెలీ కన్సల్టెషన్ సేవలు కూడా అందుబాటులో ఉంటా యి. డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, గౌన్ అండ్ అబ్స్, జనరల్ మెడిసిన్, డైట్ అండ్ నూట్రిషియన్, ఆర్థోపెడిక్, సైకాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్, పల్మోనా లజీ తదితరల వ్యాధి బాధితులకు నిపుణులైన వైద్యులు ఫోన్ ద్వారా రోగులను పరీక్షిస్తారు. ఔట్‌రిచ్ సేవలు, కౌన్సిలింగ్, వ్యాధినిరోధక కార్యక్రమాలు (వ్యాక్సినేషన్), కుటుంబ నియంత్రణ, కౌమార క్లినక్, ఎన్‌సీడీ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.






