29 August, 2026 | 6:06 PM

రామేశ్వరం పల్లి పీఏసీఎస్‌ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

29-08-2026 05:04 PM

బిక్కనూర్,(విజయక్రాంతి): బిక్కనూర్ మండలం రామేశ్వరం పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన చైర్మన్‌గా బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

పీఏసీఎస్‌లు రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తూ సమస్యల పరిష్కార కేంద్రాలుగా పనిచేయాలని సూచించారు. భిక్కనూర్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.