23 August, 2026 | 1:44 AM

పుస్తకాల బదులు కత్తులు!

23-08-2026 12:00 AM
  1. పసి మనసుల్లో నేర బీజాలు
  2. జల్సాలు, మత్తు, సోషల్ మీడియా ప్రభావం దారి తప్పుతున్న బాల్యం
  3. మార్కులు, ర్యాంకులే కాదు..
  4. పిల్లల మనసులనూ చదవాలి టీచర్ రూపారెడ్డి హత్య హెచ్చరిక 
  5. కౌన్సెలింగ్, విలువలతో కూడిన విద్యతోనే అడ్డుకట్ట  

నల్లగొండ బ్యూరో/రంగారెడ్డి, ఆగస్టు 2౨ (విజయక్రాంతి): ఒకప్పుడు గురువు కనిపిస్తే తలవంచి నమస్కరించే రోజులు.. ఆయన మాటను వేదవాక్కుగా భావించే సంస్కారం.. తప్పుదారి పడితే మందలించి, మంచి మార్గం చూపే గురువంటే గుండెల్లో గౌరవం. కానీ, కాలం మారిం ది. సాంకేతికత మనిషిని దగ్గర చేసినా.. విలువలకు మాత్రం దూరం చేస్తోంది. గురువు అంటే గౌరవించాల్సి న వ్యక్తి కాదు, కేవం పాఠాలు చెప్పే ఉద్యోగి అన్న భావం కొందరు విద్యార్థుల్లో పెరుగుతోంది.

అటువంటి భావన ఎంతటి విషాదానికి దారితీస్తుందో నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున విద్యా సంస్థలో చోటు చేసుకున్న టీచర్ రూపారెడ్డి హత్యోదంతం కళ్లకు కట్టినట్టు చెబుతోంది. తమను సన్మార్గంలో నడిపించేందుకు మందలించిన గురువునే విద్యార్థులు హతమార్చడం గురుశిష్య బందానికే మాయని మచ్చగా మిగిలింది. పుస్తకాల్లో చదివే ‘మాతృతేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ’ మాటలు ఆచరణలో ఎందుకు కనుమరుగు అవుతున్నాయన్న ప్రశ్నను ఈ ఘటన సమాజం ముందుంచింది. ఇది ఒక్క హత్యోదంతం కాదు.. పిల్లల చేతుల్లో పుస్తకాల స్థానంలో పక్కదారి పట్టించేవి ఉన్నాయనేది ప్రమాద ఘంటిక.  

గురుశిష్యుల బంధం బలహీనపడుతుందా?

పటిష్టంగా ఉండాల్సిన గురు శిష్యుల బంధం నానాటికీ బలహీనపడుతోంది. విద్యార్థి, గురువు మధ్య ఉండాల్సిన సంభాషణ స్థానంలో ఘర్షణ, గౌరవం స్థానంలో ఆగ్రహం, సమస్య పరిష్కారం స్థానంలో హింస చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు గురువు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు. విద్యార్థి కుటుంబ పరిస్థితిని తెలుసుకునేవాడు. అతని బలాలు, బలహీనతలను గమనించేవాడు. తప్పు చేస్తే మందలించేవాడు. అవసరమైతే తల్లిదండ్రులతో మాట్లాడేవాడు.

విద్యార్థి కూడా గురువును తన భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శిగా భావించేవాడు. కానీ, విద్యావ్యవస్థలో ప్రైవేటీకరణ పెరిగిన కొద్దీ మార్కులు, ర్యాంకులు, ఫీజులు, ఫలితాలు, ఉద్యోగ భద్రత, సంస్థ ప్రతిష్ఠ వంటి వాణిజ్య అంశాలు ప్రాధాన్యం పొందాయి. విద్యార్థి ’కస్టమర్’గా, తల్లిదండ్రులు ’ఫీజు చెల్లించే వినియోగదారులు’గా, ఉపాధ్యాయుడు ’సేవ అందించే ఉద్యోగి’గా చూసే ధోరణి పెరిగింది. ఫలితంగా విద్యాసంస్థల్లో మానవ సంబంధాల కంటే వ్యాపార సంబంధాలకు ప్రాధాన్యం పెరుగుతోంది.

చెడగొడుతున్న సోషల్ మీడియా 

సోషల్ మీడియా ద్వారా పిల్లలకు చేరుతున్న కంటెంట్  వారి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసి వారిలో గణనీయ మానసిక మార్పుకు కారణమవుతుందని చెప్పవచ్చు. అలాగే సినిమాలు, టీవీలు, వెబ్ సిరీస్‌లు తొడవుతున్నాయి. మాదకద్రవ్యాలు, హింస వంటి అంశాలను సాధారణ వినోదంగా చూపించే దృశ్యాలు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. మద్యం, ఇతర చెడు అలవాట్లను సాధారణ జీవనశైలిలో భాగంగా చూపించే ధోరణి కూడా పెరుగుతోంది. 

మాదకద్రవ్యాల ప్రభావం ఎక్కువే

సోషల్ మీడియా ద్వారా ప్రభావితం అయిన విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులవుతున్నారు. వీటి ప్రభావం వారి జీవనశైలిలో పెను మార్పులను తీసుకువస్తున్నాయి. అందుకే మాదకద్రవ్యాల విషయంలో పాఠశాలలు, తల్లిదండ్రులు, పోలీసులు, స్థానిక సమాజం సమన్వయంతో పనిచేయాలి. పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు కనిపిస్తే వాటిని కేవలం ’చదువులో శ్రద్ధ లేదు’ అని కొట్టిపారేయకుండా, వారి మానసిక, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి.

మరికొన్ని ఘటనలు

* నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున విద్యా సంస్థల డైరెక్టర్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని అదే పాఠశాలల పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు జల్సాలకు అలవాటు పడి డబ్బుకోసం హత్య చేశారు.

* హైదరాబాద్‌లోని బాచుపల్లిలో అన్‌లైన్ బెట్టింగ్, పబ్జీ గేమింగ్, ఇతర జల్సాలకు అలవాటు పడ్డ ఓ మైనర్ విద్యార్థి డబ్బుల కోసం తన స్నేహితుడినే కిడ్నాప్ చేసి హత్య చేశాడు.

* విశాఖపట్నంలో కార్లు, బైక్లు అద్దెకు తీసుకుని షికార్లు చేయడం, పబ్‌లకు వెళ్లడం కోసం కొందరు కళాశాల విద్యార్థులు గ్రూప్‌గా ఏర్పడి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.

* విజయవాడలో గంజాయి, తాగుడుకు బానిసలైన కొందరు మైనర్లు, తమ దగ్గర డబ్బులు లేకపోవడంతో తోటి విద్యార్థిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని చూశారు. అతడు నిరాకరించడంతో దాడి చేసి గాయపరిచారు.

* కర్ణాటక రాష్ట్రం హాసన్‌లో ఓ యువకుడు ఐఫోన్ కొనుగోలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో కొత్త ఎత్తుగడ వేశాడు. ఆన్‌లైన్‌లో ఫోన్ ఆర్డర్ చేసి, డెలివరీ చేయడానికి వచ్చిన బాయ్‌ను హత్య చేసి ఫోన్ దొంగిలించాడు. ఇటువంటి ఘటనలు మరెన్నో ఉన్నాయి.