27 May, 2026 | 1:42 AM

రూ. 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

27-05-2026 12:59 AM
  1. ఎకరాకు లక్ష డిమాండ్ చేసిన శామీర్‌పేట అధికారి
  2. రూ.10వేలు తీసుకుంటూ పట్టుబడిన వడ్డేపల్లి సర్వేయర్

మేడ్చల్/అలంపూర్, మే 26(విజయక్రాంతి): మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలానికి చెందిన తహసీల్దార్ టి.సుచరిత రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద కుమార్ తెలిపిన వివరాల మేరకు 30 ఎకరాల వ్యవసాయ భూమిలో నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తును ఆమోదించాలని తహసీల్దార్‌ను రైతు కోరగా అందుకు రూ.30లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా మంగళవారం కార్యాలయంలో తహసీల్దార్ సుచరిత డ్రైవర్‌కు రూ.2లక్షలు ఇవ్వాలని సూచించారు.

ఈక్రమంలో డ్రైవర్‌కు రెండు లక్షలు అందజేస్తుండగా తహసీల్దార్‌ను, డ్రైవర్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. తహసీల్దార్‌తో పాటు ఆర్డీవోను కూడా విచారిస్తామన్నారు. కాగా ఓరైతుకు చెందిన నాలుగు ఎకరాల 14 గుంటల వ్యవసాయ భూమిని సర్వే చేసేందుకు లంచం డిమాండ్ చేసిన మండల సర్వేయర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు మంగళవారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వివరాలు వెల్లడించారు.

గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ బ్రహ్మయ్య కొంకల గ్రామానికి చెందిన రైతుకు చెందిన మొత్తం 4.14 గుంటల వ్యవసాయ భూమిని సర్వే చేయడానికి ఎకరాకు రూ. ఐదువేలు చొప్పున మొత్తం రూ.20వేలు ఇవ్వాలని  డిమాండ్ చేసి అడ్వాన్స్‌గా రూ.ఐదువేలు తీసుకున్నాడు. మొత్తం డబ్బులు ఇస్తేనే సర్వే చేస్తానని సర్వేయర్ మొండికి వేయడంతో రైతు ఏసీబీ అధికారులను సమాచారం ఇచ్చాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో పక్క సమాచారంతో వెళ్లిన బృందం రైతు నుంచి ౧౦వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నట్లు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని నాంపల్లి ఏసీబీ కోర్టు తరలించినట్లు డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.