ధాన్యం కొనుగోలు సేకరణలో ప్రభుత్వాలు విఫలం
మొసలి కన్నీరు కార్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు
నేడు గజ్వేల్ మార్కెట్ వద్ద ధర్నా
స్పందించకపోతే రాజీవ్ రహదారి దిగ్భందిస్తాం
విలేకరుల సమావేశంలో గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాపరెడ్డి
గజ్వేల్, మే 26: ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
ధాన్యం సేకరణ, దిగుమతి, ఎగుమతి బాధ్యత కేంద్రానిదేనని, సమాచారం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం, సేకరణలో కేంద్రం విఫలమైందన్నారు. హమాలీలు, స్టోరేజ్ గోదాంలు, లారీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రెండున్నరేళ్లలో ఒక్క గోదాం కూడా నిర్మించలేదని, కేసీఆర్ హయాంలో గోదాంల నిర్మాణం జరిగిందన్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలు రైతుల వెంట ఉన్నామంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలు మూసేస్తామని చెప్పడం దారుణమన్నారు. ఇప్పటికే 18 మంది రైతులు వడదెబ్బతో మృతి చెందారని, ప్రతి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అలీబాబా 40 దొంగలులా వ్యవహరిస్తోందని, బీజేపీ ఎంపీలు భూ కబ్జాలపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. వెంటనే అన్ని ఏర్పాట్లు చేసి ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి గజ్వేల్ మార్కెట్ ముందు దీక్ష నిర్వహిస్తామన్నారు. రెండు గంటల్లో ఆర్డీవో, కలెక్టర్, ఆయా మండలాల తహసీల్దార్లు వచ్చి సమాధానం చెప్పాలని, లేకపోతే రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు, అంబరి రామచంద్రం, అనంతుల ప్రశాంత్, పిఎసిఎస్ చైర్మన్లు బట్టు అంజిరెడ్డి, ఆలేటి ఇంద్రసేనారెడ్డి, యూత్ వి నాయకుడు జుబేర్ పాషా ఎంపీపీలు పాండుగౌడ్, రమేష్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, అమరేందర్, మనోహరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, మాజీ ఎంపీటీసీ పొట్టోల శ్రీనివాస్ గౌడ్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అర్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






