మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ...
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధ వారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో జిల్లా కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి ర్యాంకులు సాధించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల (లోకల్ బాడీ, ఎయిడెడ్, జీఏహెచ్ఎస్, జీహెచ్ఎస్, కేజీబీవీ, ఎంజేపీ, టీఎంఆర్ఎస్, టీఎస్ఎంఎస్, టీఎస్ఆర్ఎస్, టీఎస్ డబ్ల్యూఆర్ఎస్) విభాగంలో అత్యధిక మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు.
మంథెన సంజన 586 మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలువగా గుజ్జేటి శ్రీవాణి 576, అంకం శ్రీ సాయి హర్ష 573 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంకులు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ పాఠశాలలో 550 మార్కులకుపైగా ఏడుగురు, 32 మంది విద్యార్థులు 500 మార్కులు సాధించారు. మంచి మార్కులతో టాపర్ గా నిలిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్నతో పాటు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.
పేదింటి నుంచే విద్యాకుసుమాలు...
కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు పోటీపడుతున్నారనడానికి నిదర్శనంగా జిల్లా స్థాయిలో టాపర్ గా నిలిచిన విద్యార్థులను చూపించవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలే అధికంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తుంటారు. అదే కోవకు చెందిన వారు ఈ ముగ్గురు విద్యార్థులు.
పురోహితుడి కూతురు జిల్లా టాపర్ గా...
పురోహితం చేస్తూ జీవనం సాగించే వెంకటేశ్వర్, మంజుల దంపతుల కూతురు మంథెన సంజన 586 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లా టాపర్ నిలిచింది. ఇంజనీర్ కావాలనే లక్ష్యంతోనే కష్టపడి చదివానని, లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటాననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందన్నారు.
ఆటో డ్రైవర్ కూతురు...
ఆటో డ్రైవర్ గా పని చేస్తు కుటుంబాన్ని సాధుకుంటున్న గుజ్జేటి రవి, విజయలక్ష్మీ కూతురు గుజ్జేటి శ్రీవాణి 576 మార్కులతో జిల్లా ర్యాంకర్ గా నిలిచారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో చదివి టార్గెట్ ను సాధిస్తానని పేర్కొంది. తల్లిదండ్రులు కోరుకున్నట్లు ఇంటర్ లో సైతం మంచి మార్కులు సాధిస్తాననే ఆశాభావం వ్యక్తం చేశారు.






