3 May, 2026 | 7:34 PM

తమిళ మిక్చర్!

24-08-2025 12:00 AM

మరో ఎనిమిది నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండటంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే అసలు పోటీగా దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికల సమరంలో రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్న ప్రజాదరణ గల నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం చేయడం వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. విజయ్ అధ్యక్షునిగా తమిళనాడు, పాండిచ్చేరిలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) గతేడాది ఫిబ్రవరిలో ఆవిర్భవించింది.

కోటి యాభై లక్షల మంది దళపతి విజయ్ అభిమానులు ఇప్పటికే టీవీకే సభ్యత్వం తీసుకున్నారు. సామాజిక న్యాయం మొదలు మార్క్సిజం ఆచరణ వరకు టీవీకే తన సిద్ధాంతంగా ప్రకటించుకున్నది. గత ఎన్నికల్లో డీఎంకే మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో 133 సీట్లు సాధించి అన్నాడీఎంకే నుంచి అధికారం చేజెక్కించుకుంది. ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసిన అన్నాడీఎంకేకు 66 సీట్లు దక్కాయి.

మొత్తంగా ఎన్డీఏ సాధించిన 75 సీట్లలో అన్నాడీఎంకేకు సింహభాగం సీట్లు లభించడంతో బీజేపీతో తమకు కలిసివచ్చేదేమీ లేదన్న భావన అన్నాడీఎంకేలో ఆ తర్వాత స్పష్టంగా కనిపించింది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటరీ సీట్లు పెంచుకుంటే తప్ప రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కలేమని భావిస్తున్న బీజేపీ, అన్నాడీఎంకే చేయి వదలకుం డా జాగ్రత్త పడుతున్నది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య అంతర్గత విభేదాలు ఏళ్లుగా కొనసాగి అన్నాడీఎంకేను మరింత దిగజర్చాయి.

ఇటీవల మార్నింగ్ వాక్‌లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసిన కొద్ది గంటల్లోనే ఎన్డీఏకు పన్నీర్ సెల్వం గుడ్‌బై చెప్పారు. అన్నాడీఎంకేలోని ఆయన వర్గం ఇప్పుడు విజయ్‌తో చేతులు కలిపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నా యి. దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే పట్ల ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించనప్పటికీ, రానున్న ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారనేది కూడా స్పష్టంగా కనిపిస్తున్నది.

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నెలకు వెయ్యి రూపాయల వంటి పాపులర్ పథకాలు, పలు అభివృద్ధి ప్రాజెక్టులతో స్టాలిన్ ప్రభుత్వం ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నా, వాటి అమలులో జరిగిన జాప్యం అసంతృప్తిని మిగిల్చింది. విద్యుత్, నీటి చార్జీలు, పాల ధరల పెంపు, వృత్తి పన్నుల పెంపు మధ్య తరగతి, వ్యాపార వర్గాల్లో నిరసనకు కారణమవుతున్నాయి. నెలవారీ ఖర్చులు పెరిగాయని మధ్యతరగతి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది.

నీట్ పరీక్షను రద్దు చేయడంలో న్యాయపరమైన చిక్కులు, అభ్యర్థుల ఆత్మహత్యలు డీఎంకే ప్రభుత్వానికి సంకటంగా మారాయి. పార్టీ ఏదైనా, తమిళనాడులోని కొందరు రాజకీ య నాయకుల అవినీతి ఎప్పుడూ ఒక అంశంగానే ఉంటున్నది. ఈ పరిస్థితుల్లో డీఎంకే వ్యతిరేక ఓటును విజయ్ తనవైపు తిప్పుకొని, అన్నా డీఎంకేకు సంప్రదాయంగా వస్తున్న నియోజకవర్గాలను కొన్నింటిని కొల్లగొడుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.

యువత, మహిళల్లో మంచి పాపు లారిటీ ఉన్న దళపతి విజయ్, కొత్త సమీకరణాలతో తన పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వసిస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన టీవీకే రెం డు సభలకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చినా, తన ప్రసంగాలతో విజ య్ జనాన్ని ఆకర్షించినా రాజకీయ చదరంగంపై ఆయన పావులు విజ యం దిశగా కదుపుతారా అనేది వేచిచూడాల్సిందే.