తెలంగాణలో తమిళిసై ప్రచారం
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): గత నెలలో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడులోని చెన్నై సౌత్ నుంచి ఆమె ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేశారు. అక్కడ ఎన్నికలు మొదటి దశలోనే పూర్తి కావడంతో నేటి నుంచి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. సుమారు 10 రోజుల పాటు రాష్ట్రంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థుల కోసం ఆమె ప్రచారం నిర్వహిస్తారని బీజేపీ పార్టీ శ్రేణులు తెలిపాయి. తమిళనాడు నుంచి వచ్చిన బీజేపీ వాలంటీర్లతో కలిసి మాజీ గవర్నర్ ప్రచారం చేస్తారు. తెలంగాణలో ఉన్న తమిళ ప్రజలను సైతం ఆమె ప్రత్యేకంగా కలిసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై బాధ్యతలు చేపట్టారు.
2021 ఫిబ్రవరి 18 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ ఆమె అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తమిళనాడులో ఎంపీగా పోటీ చేసేందుకు గాను గత నెల 18వ తేదీన గవర్నర్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎంతో నిరాడంబరంగా ఉండే ఆమె గత నాలుగేళ్లలో గవర్నర్‌గా చక్కగా బాధ్యతలను నిర్వర్తించినట్లుగా తెలంగాణ ప్రజలు భావించారు. అయితే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో మాత్రం గవర్నర్‌తో సత్సంబంధాలు కొనసాగలేదు. రాష్ట్రంలో తమిళిసైకు ప్రజల్లో ఉన్న గుర్తింపును సద్వినియోగం చేసుకుని ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించిన బీజేపీ నాయకత్వం ఆమెను ప్రత్యేకంగా ప్రచారం కోసం తెలంగాణకు పిలిచింది.






