24 April, 2026 | 10:57 PM

జిల్లాల్లోనూ యాంటీ ర్యాగింగ్ కమిటీలు

29-04-2024 12:07 AM

ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు యూజీసీ ఆదేశాలు 

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): జిల్లాస్థాయిలోనూ యాంటీ ర్యాంగింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) లేఖలు రాసింది. ఇప్పటి వరకు యూనివర్శిటీల్లో మాత్రమే ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, నగరాల్లోనే కాక జిల్లాలు, పట్టణాల్లోనూ ర్యాగింగ్ ఘటనలు సంభవిస్తుండటంతో యూజీసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తన లేఖల్లో పేర్కొంది. ఈ కమిటీలకు జిల్లా కలెక్టర్ లేదా డిప్యూటీ కమిషనర్ అధిపతిగా ఉంటారు. విశ్వవిద్యాలయం లేదా కళాశాల యాజమాన్యం, జిల్లా ఎస్పీ సభ్యులుగా ఉండాలని ఆదేశించింది.

అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ర్యాగింగ్ పరిధిలోకి వచ్చే సంఘటనలను పర్యవేక్షించడానికి స్థానిక మీడియా, జిల్లా స్థాయి స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, స్థానిక సోలీసులు, స్థానిక పరిపాలన అధికారులు కమిటీలో ప్రతినిధులుగా చేర్చాలని తెలిపింది. కమిటీలను ఏర్పాటు చేసి వేసవి సెలవుల్లో విద్యాసంస్థలను భాగస్వామ్యం చేసి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. ప్రతి కార్యక్రమం తర్వాత విద్యార్థుల నుంచి రెగ్యులర్ ఫీడ్‌బ్యాక్‌ను ఇంగ్లీష్, హిందీ భాషలతోపాటు స్థానిక భాషల్లోనూ తీసుకోవాలని స్పష్టం చేసింది. స్థానిక పోలీసుల సహాయంతో వర్సిటీలు, విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిరోధించాలని పేర్కొంది. 

యాంటీ ర్యాగింగ్ స్వాడ్స్..

కమిటీలతోపాటు యాంటీ ర్యాగింగ్ స్వాడ్‌ను ఏర్పాటు చేయాలని యూజీసీ తన ఆదేశాల్లో పేర్కొంది. విద్యార్థులు గుమిగూడే ప్రాంతాలు, కీలకమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహణ ద్వారా ర్యాగింగ్ నిరోధక యంత్రాంగాన్ని పటిష్టం చేసే వీలుంటుందని ఉన్నత విద్యాసంస్థలను తెలిపింది. విద్యార్థులతో ఎప్పటికప్పుడు ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించింది. విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రకటనలు, బుక్‌లెట్లను ప్రచురించేలా చూడాలంది. హాస్టళ్లు, క్యాంటీన్లు, విశ్రాంతి, ఎంటర్‌టైన్మెంట్ ప్రదేశాలు, టాయిలెట్లు, బస్టాప్‌లను ఆకస్మికంగా తనిఖీలు చేయాలని ఆదేశించింది. అడ్మిషన్ సెంటర్, డిపార్ట్‌మెంట్లు, లైబ్రరీ వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో హెచ్చరికలను జారీ చేస్తూ పోస్టర్లను అతికించాలని సూచించింది. అదేవిధంగా ఆయా విద్యాసంస్థలు కమిటీలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, చర్యలు తీసుకోవడంలో విఫలమైనా వాటిపై కఠిన చర్యలు తప్పవని యూజీసీ హెచ్చరించింది.