9 August, 2026 | 2:26 AM

భారత్‌పై 100% సుంకాలు

09-08-2026 12:48 AM
  1. చైనా, అజర్‌బైజాన్, హంగేరీ, స్లోవేకియా దేశాలపై కూడా
  2. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలే అమెరికా టార్గెట్
  3. ఇరాన్, రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు సెనెట్ ఆమోదం

వాషింగ్టన్, ఆగస్టు ౮: రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలను అమెరికా టార్గెట్ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి చమురు వ్యాపారమే ఆర్థిక దన్ను అని భావిస్తూ, ఆ దేశం నుంచి చమురు కొనే భారత్, చైనా, అజర్‌బైజాన్, హంగేరీ, స్లొవేకియా ఉత్పత్తులపై 1౦౦ సుంకాలు విధించాలని నిర్ణయానికి వచ్చింది. దీనిలో భాగంగానే అమెరికన్ సెనెట్ శనివారం రష్యా, ఇరాన్‌పై ఆంక్షలు విధించే బిల్లుకు ఆమోదం తెలిపింది.

86--11 ఓట్ల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందింది. అగ్రరాజ్యం బిల్లుకు ‘లిండ్సే వో గ్రాహం రష్యా, ఇరాన్ ఆంక్షల చట్టం-2026’ అని నామకరణం చేసింది. కొత్త చట్టం ద్వారా ఆ ఐదు దేశాల ఉత్పత్తులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు లభిస్తుంది.

రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమోక్రాట్ నేత రిచర్డ్ బ్లూమెంతాల్ సంయుక్తంగా ఈ బిల్లును రూపొందించారు. ఇటీవల లిండ్సే గ్రాహం హఠాన్మరణం చెందారు. ఆయన జ్ఞాపకార్థం ఈ బిల్లును సెనెట్ త్వరితగతిన ఆమోదించింది. చట్టం పూర్తిగా అమలులోకి రావడానికి ముందు ఈనెల 31న అమెరికా ప్రజాప్రతినిధుల సభ ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’ ఆమోదం పొందాల్సి ఉంది.