పాల్వంచలో పేకాట గుట్టు రట్టు
పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు
పాల్వంచ, (విజయక్రాంతి): పట్టణ పరిధిలోని గుడిపాడు పేట చెరువు సమీపంలో సాగుతున్న పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు అకస్మిక దాడులు నిర్వహించారు. దీంతో పాల్వంచ పట్టణంలో ఒక్కసారి కలకలం చెలరేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోప్యమైన సమాచారం మేరకు గుడిపాడు పేట చెరువు ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో మూడు ద్విచక్ర వాహనాలు, ఫోన్లో, ఆరుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ 13 వేలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ దాడుల్లో సుమారు రూ 20 లక్షల నగదు, 15 ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు, కేటీపీఎస్, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువమంది ఈ దాడుల్లో పోలీసులకు చిక్కినట్లు మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటనపై అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.




