31 July, 2026 | 9:47 PM

ఏపీలో ఖరీఫ్ కు పీఎంఎఫ్‌బీవై బీమా భాగస్వామిగా టాటా ఏఐజీ

31-07-2026 09:05 PM

విజయవాడ: 

2026 ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మది జిల్లాల్లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను (పీఎంఎఫ్‌బీవై) బీమా భాగస్వామిగా టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అమలు చేయనుంది.

అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణ, కర్నూలు, ఎన్‌టీఆర్, పార్వతిపురం మన్యం, ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలు వీటిలో ఉన్నాయి. స్కీము కింద నోటిఫై చేసిన పంటలను సాగు చేస్తున్న రైతులను పథకంలో ఎన్‌రోల్ చేసేందుకు టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తోడ్పాటు అందిస్తుంది.

ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పంట సంబంధ రిస్కుల నుంచి ఎదురయ్యే ఆర్థిక ప్రభావాలను అధిగమించేందుకు, జీవనోపాధిని సంరక్షించుకునేందుకు పీఎంఎఫ్‌బీవైలో చేరడం వల్ల రైతులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ) లేదా నేరుగా అధికారిక పీఎంఎఫ్‌బీవై వెబ్‌సైట్ ద్వారా రైతులు ఎన్‌రోల్ చేసుకోవచ్చు. అలాగే కటాఫ్ తేదీలోగా తమకు వర్తించే ప్రీమియంను చెక్ చేసుకుని,  ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, కీటకాలు, వ్యాధుల వల్ల తలెత్తే పంట నష్టాల నుంచి రైతులకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా పీఎంఎఫ్‌బీవై పంట బీమా పథకాన్ని అందిస్తున్నాయి.