బిజెపి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దిష్టిబొమ్మ దగ్ధం
బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలి బిజెపి మహిళా మోర్చా డిమాండ్.
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు లైంగిక, ఆర్థిక నేరాలకు పాల్పడిన అతడిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో రేగా కాంతారావు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ... బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కావడం ఆయన దిగజారుడు రాజకీయాలకు, క్రిమినల్ ప్రవర్తనకు నిదర్శనం అని ధ్వజమెత్తారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో ఒక యువతి వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించడమే కాకుండా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. కేసును పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, రేగా కాంతారావును వెంటనే అరెస్ట్ చేయాలి. బాధితురాలికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తూ, ఆమెకు తగిన పోలీసు రక్షణ కల్పించాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, బిజెపి మహిళా నాయకురాలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






