కదంతొక్కిన బ్యాంకింగ్ షేర్లు
- ఐదో రోజూ పెరిగిన సెన్సెక్స్, వెనక్కు తగ్గిన నిఫ్టీ
న్యూఢిల్లీ, జూన్ 19: బ్యాంకింగ్ షేర్లు, ప్రత్యేకించి ప్రైవేటు బ్యాంక్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ వరుసగా ఐదో రోజూ లాభపడింది. రికార్డుస్థాయిల్లో కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎనర్జీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు గరిష్ఠస్థాయిల్ని నిలుపుకోలేకపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ బుధవారం ఇంట్రాడేలో 550 పాయింట్లు ఎగిసి 77,852 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు 36 పాయింట్ల స్వల్ప లాభంతో 77,338 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 106 పాయింట్లు ర్యాలీ జరిపి 23,664 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ముగింపులో ఎంపికచేసిన షేర్లలో జరిగిన లాభాల స్వీకరణ ఫలితంగా 42 పాయింట్ల నష్టంతో కీలకమైన 23,516 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తీవ్ర ఒడిదుడుకులతో సాగిన ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ స్టాక్స్‌లో జోరుగా కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ లాభాలతో ముగియగలిగిందని, ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికం, రియల్టీ షేర్లలో జరిగిన లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టీ డీలా పడిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు. వచ్చే నెలలో కేంద్ర బడ్జెట్ ఉన్నందున, ఆయా రంగాలవారీగా, షేర్లవారీగా ట్రేడింగ్ కార్యకలాపాలు జరుగుతాయని అన్నారు. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ సూచీలు గ్రీన్‌లో ముగిసాయి. షాంఘై ఇండెక్స్ తగ్గింది. యూరప్ సూచీలు స్వల్పనష్టాలతో ముగిసాయి. యూఎస్ మార్కెట్లకు బుధవారం సెలవు.
యాక్సిస్ బ్యాంక్ టాపర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా యాక్సిస్ బ్యాంక్ 3.12 శాతం పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3.06 శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 2 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు టైటాన్, మారుతి, భారతి ఎయిర్‌టెల్, లార్సన్ అండ్ టుబ్రో, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్‌లు 2.5 శాతం వరకూ క్షీణించాయి. వివిధ రంగాల సూచీల్లో రియల్టీ ఇండెక్స్ అధికంగా 2.97 శాతం నష్టపోయింది.
క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.15 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.97 శాతం, పవర్ ఇండెక్స్ 1.86 శాతం, ఇండస్ట్రియల్ ఇండెక్స్ 1.82 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 1.46 శాతం చొప్పున తగ్గాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకెక్స్, ఐటీ సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.91 శాతం, స్మాల్‌క్యాప్ సూచి 0.58 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,235 షేర్లు తగ్గగా, 1,634 షేర్లు పెరిగాయి.
ఎఫ్‌పీఐలు రూ.8,000 కోట్ల పెట్టుబడి
జూన్ తొలి రెండు వారాల్లో వరుస అమ్మకాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) తిరిగి జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. గత రెండు రోజుల్లో రూ.4,700 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌పీఐలు బుధవారం ఒకే రోజున రూ.7,908 కోట్ల నిధుల్ని మార్కెట్లో పెట్టుబడి చేసినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మొత్తం ఈ మూడు రోజుల్లో ఈ ఇన్వెస్టర్ల నికర కొనుగోళ్లు రూ.12,600 కోట్లకు చేరాయి.






