20 నుంచి టీసీఏ ఆల్‌స్టార్ టీ20 సూపర్ లీగ్
హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న యువక్రికెటర్లను వెలికి తీస్తున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) ఆల్‌స్టార్స్ టీ20 సూప ర్ లీగ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 20 నుంచి వరంగల్‌లో ఈ టోర్నీ జరగనుంది. దీనిలో పాల్గొనే ఆరు జట్లను టీసీఏ సెక్రటరి ధరం గురువారెడ్డి ప్రకటించారు.
గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన తెలంగాణ గోల్డ్ కప్ అంతర జిల్లా లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను ఆల్‌స్టార్స్ టీ20 సూపర్ లీగ్ కోసం ఎంపిక చేశారు. ఆదిలాబాద్ యారోస్‌కు జా దవ్ శివ, పాలమూరు పైరేట్స్‌కు వి ఉమేశ్ చారి, ఖమ్మం లయన్స్‌కు ఇమ్రాన్ షేక్, కాకతీయ కింగ్స్‌కు ఆదిత్య సాయికుమార్, మెద క్ మాస్టర్స్‌కు ఆదిత్య ఎన్‌కె, రంగారెడ్డి రేంజర్స్‌కు జకీర్ హుస్సేన్ కెప్టెన్లుగా ఎంపి కయ్యారు.
ఏప్రిల్ 20 నుంచి 27 వరకూ లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా...ఫైనల్ తేదీ, వేదికను తర్వాత ప్రకటించనున్నారు. తెలంగాణలోని 32 జిల్లాల్లో ఎంతో ప్రతిభ ఉందని, వారికి టీసీఏ చక్కని వేదికగా మారిందని సెక్రటరీ గురువారెడ్డి చెప్పారు. హెచ్‌సీఏ తెలంగాణ జిల్లాల క్రికెట్ అభివృద్ధిని పట్టించుకోకున్నా, టీసీఏ మాత్రం ప్రతీ ఏడాదీ టోర్నీలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆల్‌స్టార్స్ టీ20 సూపర్ లీగ్ నుంచి మరింత మంది యువక్రికెటర్లు వెలుగులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.






