4 April, 2026 | 2:42 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం

04-04-2026 01:24 PM

బడిలో విద్యార్థులు—  బడిబయట టీచర్లు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో తరచుగా పాఠశాలకు వెళ్లే టీచర్లు డుమ్మాలు కొడుతూ బడిబాయటే తిరుగుతున్నారు. వారి స్వంత పనులు చేసుకుంటూ పాఠశాల పని సమయాల్లో డుమ్మాలు కొడుతూ పిల్లల చదువుకు ఎగనామం పెడుతున్నారు. ఒకపక్క జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ ను మొదలుపెట్టి ఉపాధ్యాయులు కచ్చితంగా సమయపాలన పాటించాలని చెబుతుంటే మరోపక్క ఇలాంటి టీచర్లు కలెక్టర్ ను, విద్యాశాఖ అధికారిని సైతం పెడ చెవిన పెట్టి తిరుగుతుండడం కొసమెరుపు. వీరికి విద్యాశాఖలోని ఎంఈఓలు, యూనియన్ లీడర్లు, పై అధికారులు సహకరిస్తుండడం గమనార్హం.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ గుడి వద్ద గల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు తరచుగా డుమ్మాలు కొడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉర్దూ మీడియం పిల్లలు అతి తక్కువగా ఉంటారు. వారికి కనీసం పాటలు చెప్పడానికి టీచర్లు మొగ్గు చూపడం లేదు. ఈ పాఠశాలలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా, శనివారం రోజున ప్రధానోపాధ్యాయుడు అక్బర్, మరొక ఉపాధ్యాయుడు లీవ్ లో ఉన్నారు. ఉన్న ముగ్గురు ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి దానిలో రాథోడ్ శంకర్ అనే ఉపాధ్యాయుడు బయట తన సొంత ఇంటి పనులపై తిరుగుతూ విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తున్నాడు.

ఇప్పటికే చాలాసార్లు పాఠశాల పనివేళలో బయట తిరుగుతూ ఉపాధ్యాయులకే తలనొప్పి తీసుకొచ్చారని ప్రధానోపాధ్యాయుడు అక్బర్  అన్నారు.  బయటికి వెళ్లేటప్పుడు కనీసం మినిట్ బుక్ లో ఏ పని కోసం వెళ్తున్నామో రాసి వెళ్లడం ఉపాధ్యాయుల విధి. కానీ మినట్ బుక్ లో ఏమి రాయకుండానే బయట తిరిగి వచ్చి ఉపాధ్యాయులనే బెదిరిస్తుండడం గమనార్హం. ఆ సమయంలో బయట ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి అని మిగతా టీచర్లు అనడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే గ్రామాలలో ఏ విధంగా ఉందో చెప్పనక్కర్లేదు.

ఉదయం ఎఫ్ఆర్ఎస్ లో (ఫేస్ రికగ్నైజేషన్ సిస్టంలో) హాజరు నమోదు చేసుకుని బయటకు వెళ్లి సాయంత్రం వచ్చి లాగౌట్ అవుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు చేసే ఇలాంటి చేష్టలకు ఉపాధ్యాయ లోకానికి చెడ్డ పేరు వస్తుండడం శోచనీయం. ప్రభుత్వ పాఠశాలను నమ్మి విద్యార్థులను పంపిస్తే విద్యార్థులకు పాఠాలు చెప్పడం పోయి, విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తూ, లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఉండే ఇలాంటి ఉపాధ్యాయులపై కలెక్టర్, విద్యాధికారి కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.