08-07-2025 01:54:01 AM
- దారికి అడ్డుగా ‘ప్రణీత్ ఆంటిల్యా’ అడ్డుగోడ
- తొలగించిన హైడ్రా
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (విజయక్రాంతి): దారికి అడ్డంగా నిర్మించిన గోడపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా.. గోడను కూల్చి 8 కి.మీ.ల దూరాన్ని 3 కి.మీ.లకు తగ్గించింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం మల్లంపేట, -బాచుపల్లి గ్రామాల మధ్య ప్రణీత్ ఆంటిల్యా విల్లా కమ్యూనిటీ ఏర్పడింది.
గతంలో ఈ విల్లా నుంచి సుమారు 10 కాలనీలకు ఉన్న దారిపై గోడను నిర్మించారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నుంచి మల్లంపేట, బాచుపల్లి క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రగతినగర్‌కు చేరుకోవాలంటే 8 కి.మీ.లు ప్రయాణించాల్సి వస్తున్నది. అదే ప్రణీత్ ఆంటిల్యా మీదుగా ఉన్న రహదారి కేవలం 3 కిలోమీటర్ల దూర మే.
దీనిపై మల్లంపేట, ప్రణీత్ లీఫ్, డ్రీమ్ వ్యాలీ, సాయినగర్, బృందావన్, ఏపీఆర్, ఇందిరమ్మ కాలనీలతో పాటు మరో పది కాలనీల ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు విచారణ చేపట్టి, సంస్థ లేఅవుట్ అనుమతులను పరిశీలించగా అది గేటెడ్ కమ్యూనిటీ కాదని తేలింది. హెఎండీఏ అనుమతుల ప్రకారం నివాస ప్రాంతాలకు చుట్టూ ప్రహరీ నిర్మించరాదని, రహదారులకు అడ్డంగా గోడలు కట్టారాదని స్పష్టంగా ఉంది.
దీంతో హైడ్రా ఇటీవల గోడను తొలగించింది. ప్రణీత్ ఆంటిల్యావాసుల అభ్యంతరంతో నిజాంపేట మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి విచారించగా, గతంలో అక్కడ బళ్లబాట ఉండేదని తేలింది. అది గేటెడ్ కమ్యూనిటీ కాదని మరోసారి నిర్ధారించి, గోడను కూల్చారు.