కంటతడి పెట్టుకున్న గ్రూప్ వన్ అభ్యర్థులు
నాగర్కర్నూల్: తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్ వన్ పరీక్షకు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష హాల్లోకి అనుమతించలేదు.దీంతో కొంతమంది అభ్యర్థులు కంటతడి పెట్టుకు న్నారు. జిల్లావ్యాప్తంగా 5,200 మంది అభ్యర్థులకు గాను 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్ వన్ పరీక్ష పదిన్నరకు ప్రారంభం అవుతున్నా ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు హాజరు కావలసి ఉందని అధికారులు పదేపదే చెప్పారు. అయినా కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా చేరుకోవడంతో నిబంధనల ప్రకారమే అధికారులు పరీక్షా హాల్లోకి అనుమతించలేదు.
దీంతో కొద్దిసేపు బ్రతిమిలాడుకొని కంటతడి పెట్టుకున్నారు. చేసేది లేక సుమారు పదిహేను మందికి పైగా అభ్యర్థులు వెనుదిరిగారు. పరీక్షా కేంద్రాల వద్ద బయోమెట్రిక్ సాయంతో అభ్యర్థులను హాల్లోకి అనుమతించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ గైక్వార్డు వైభవ్ రఘునాథ్ తెలిపారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సందర్శించారు.






