30 April, 2026 | 2:47 AM

రామప్పను దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

30-04-2026 12:45 AM

కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు

భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

వెంకటాపూర్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయాన్ని బుధవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో ఈవో ఇమ్మడి భాస్కర్ మల్లన్నకు శాలువాతో సన్మానం చేయగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు.

అనంతరం ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం మల్లన్న మాట్లాడుతూ.. రామప్ప దేవాలయం వంటి చారిత్రక కట్టడాలు తెలంగాణ గర్వకారణమని,ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలని, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం రామప్ప చెరువును సందర్శించారు. వారి వెంట టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, అరుణ్, దేవాదాయ, పురావస్తు, టూరిజం, రెవెన్యూ శాఖల సిబ్బందిలు ఉన్నారు.