17 April, 2026 | 2:47 AM

ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానిస్తారా

17-04-2026 12:53 AM

వెంటనే తేజస్వి క్షమాపణలు చెప్పాల్సిందే

బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గుడ్లప్పగించి చూడటం సిగ్గుచేటు

మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించి నందుకు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరా టం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమని, అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవ మానించడమే, అమరుల త్యాగాలను తక్కు వ చేసి చూపించడమే అని విమర్శించారు. రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి, తన పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని, లేదంటే ఇది బీజేపీ అధికారిక ధోరణిగానే ప్రజలు భావిస్తారని హెచ్చరించారు. బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపిందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ కూడా గతంలో అనేక సార్లు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారని, తేజస్వి సూర్య తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతేమిటో తేల్చేవారని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీలైనా, కాంగ్రెస్ ఎంపీలైనా తెలంగాణ పాలిట దిష్టి బొమ్మలుగా మారారని ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాట చరిత్ర స్వాభిమానానికి ప్రతీక అని, దానిని ఎవ్వరైనా అగౌ రవ పరిస్తే, అవమానిస్తే సహించేది లేదని హరీష్‌రావు హెచ్చరించారు.