ఖాళీ జాగా.. టేలా పాగా!
అడ్డూ అదుపు లేకుండా టేలాల దందా
యథేచ్ఛగా ఆక్రమణ.. ఆపై అద్దె వసూలు
నిరుపేదల పేరిట కిరాయి దందా
తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం
నిమ్మకు నీరెత్తినట్టు అధికారుల తీరు
కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 1౦ (విజయక్రాంతి): ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే చాలు యథేచ్ఛగా ఆక్రమించడం, అందులో టేలాలు ఏర్పాటు చేసి అద్దెకు ఇవ్వడం షరామామూలైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో టేలాల దందా జోరుగా సాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, దవాఖానలు, ప్రధాన మార్కెట్ కూడళ్లలో టేలాలు ఏర్పాటు చేసి, వాటిని అద్దెకివ్వడం మామూలైపోయింది. బతుకుదెరువు కోసం నిరుపేదలు వీటిని నిర్వహిస్తున్నారనుకుంటే పొరపాటే, రాజకీయ నాయకులు, వ్యాపారులు ప్రభుత్వ స్థలాలను అక్రమించి టేలాలను పెడుతున్నారు. కొంత మంది రెండు, మూడు అపైన టేలాలను ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు అద్దెకు ఇచ్చి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ముందుగానే రూ.లక్షల్లో అడ్వాన్సు లు సైతం తీసుకోవడం గమనార్హం. ప్రధాన మార్కెట్ ఏరియాలో పక్కా భవనల్లో అద్దె చెల్లించలేని చిరు వ్యాపారుల పరిస్థితి టేలా ల యాజమానులకు కలసివస్తుంది. ప్రభుత్వ స్థలాలను అక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్, పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
విచ్చవిలవిడి కబ్జాలతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి. రహదారుల పక్కనున్న స్థలాలన్ని చాలావరకు కబ్జాకు గురయ్యాయి. ప్రజలు నడవడానికి, వాహనాలు రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా ఈ టేలాలు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరికి రెండు, మూడు టేలాలు ఉన్నట్టు సమాచారం. పట్టణంలోని ఆటో స్టాండ్ సమీపంలో ఉన్న టేలాలను రహదారి విస్తరణలో తొలగించారు. పట్టణంలోని ప్రధాన స్థలాల్లో కబ్జాలు పెరిగిపో తున్నాయి. అధికారుల చేయి తడిపితే అటువైపు చూడరన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నాయకులు, బడా వ్యాపారులవే..
ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రధాన కూడ ళ్లు అంబేద్కర్ చౌక్ నుంచి వివేకానంద చౌక్ వరకు ప్రభత్వస్థలాల్లో టేలాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారాల్లో ఎవ్వరూ నీరుపేదలు లేరు. చిరువ్యాపారాలు చేసుకు నేం దుకు టేలాలు ఏర్పాటు చేసుకున్న వారి లో ఒకరిద్దరు మాత్రమే నిరుపేదలు ఉండ టం గమనార్హం. కబ్జా చేసి టేలా ఏర్పాటు చేయ డం, అపై రూ.లక్షల్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం పరిపాటి అయ్యింది. టేలాల వెనక ఆర్టీసీ సంస్థ 18 గదులను అద్దె కోసం నిర్మించి టెండర్ల ద్వారా కేటాయించింది. 8 ఏండ్లు అయిన ఆర్టీసీ దుకాణాల ముందు ఉన్న టేలాలను తొలగించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అటు టేలాల వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రభుత్వ దవాఖాన సమీపంలో రోడ్డు పక్కన నిర్మించిన మురుగు కాలువలను సైతం కబ్జా చేసి రోడ్డుకు ఇరువైపు టేలాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పాటు అయినప్పటికి అక్రమణలపై మాత్రం అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నా యి. మున్సిపాలిటీ పరిధిలోని అక్రమణలను అధికారులు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోనూ పదుల సంఖ్యల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. దీంతోపాటు పెట్రోల్ బంక్, బాలాజీనగర్, బోరిగాం శివారు చారిగాం రోడ్డులో ప్రభుత్వ స్థలాల్లో టేలాలు, షటర్లను సైతం ఏర్పాటు చేశారు. కౌటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ప్రహరిలేక పోవడంతో ఆ స్థలంలో కొంత మంది ఎలాంటి అనుమతులు టేలాలు ఏర్పాటు చేశారు.
అనుమతులు లేని టేలాలను తొలగిస్తాం
అనుమతులు లేకుండా టేలాలను ఏర్పాటు చేస్తే వాటిని తొలగిస్తాం. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా అక్రమణ చేసి టేలాలను పెట్టితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ స్థలంలో ఉన్న టేలాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి అదేశాల ప్రకారం ముందుకెళ్తాం. మున్సిపాలిటి పరిధిలో అనుమతులు లేకుండా టేలాలు, భవనాలు కడితే మా దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
- భుజంగ్‌రావు, మున్సిపాల్ కమిషనర్, ఆసిఫాబాద్






