బిల్లులు ఇప్పించండి సారూ!
నాలుగు నెలలు గడిచినా పెండింగ్‌లోనే రూ. 20కోట్ల బిల్లులు
సీఈవోకు ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (విజయక్రాంతి) : అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. తమతో పనులు చేయించిన రిటర్నింగ్ అధికారుల నుంచి రూ. 20కోట్ల బిల్లులు రావాల్సి ఉందని ఫిర్యాదులో తెలిపారు. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చేపట్టిన పోలింగ్ బూత్, డీఆర్‌ఎస్ కేంద్రాల అరెంజ్‌మెంట్స్ చేశామని కాంట్రాక్టర్లు వాపోయారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు టెండర్లకు అనుగుణంగా కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేశారు.
కానీ నాలుగు నెలలు గడిచినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లకు తిప్పలు తప్పడం లేదు. అయితే కొందరు రిటర్నింగ్ అధికారులు బినామీలతో పనులు చేపడుతూ ఎన్నికల నిధులను తమ సొంత ఖాతాలోకి మలుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పనులను పూర్తి చేయించుకోవడంపై చూపిన శ్రద్ధ, పనులు అయ్యాకా.. బిల్లులు మంజూరులో చూపించడం లేదంటూ కాంట్రాక్టర్లు వాపోతున్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో రిటర్నింగ్ అధికారుల ఆదేశాలతో పోలింగ్, డీఆర్‌ఎస్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్స్, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, ఆహారం సరఫరా, షామియానా, ఆడియో, లైటింగ్, బారికేడ్లు, పోలీస్ బందోబస్తు అరేంజ్‌మెంట్స్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తదితర పనుల నిర్వహణ చేపట్టారు.
2023 నవంబరు 30న ఎన్నికలు, డిసెంబరు 3న కౌంటింగ్ పూర్తయ్యింది. 15 నియోజకవర్గాల వ్యాప్తంగా సుమారు 150 నుంచి 200 మంది కాంట్రాక్టర్లు ఈ పనులు నిర్వహించారు. ఈ మొత్తం రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా. ఓ నియోజకవర్గంలో అరేంజ్‌మెంట్స్ చేసినందుకు రూ. 40లక్షల వరకు రావాలని ఓ కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు
అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వడం లేదని పలువురు కాంట్రాక్లర్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ రోనాల్డ్ రోస్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్‌ను కలిసి వినతులు అందించారు. అయినా వీరి నుంచి సరైన స్పందన రాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో పాటు చీఫ్ ఎన్నికల కమిషనర్(ఢిల్లీ)కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఫిర్యాదుకు స్పందించిన సీఈసీ జిల్లా ఎన్నికల అధికారికి మెమో జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రోస్ వివరణ కోరగా శుక్రవారం నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.






