25 April, 2026 | 2:32 AM

నమో.. అంటే నమ్మించి మోసం చేసే నేత!

11-05-2024 02:52 AM

ప్రియమైన మోదీ కాదు.. పిరమైన మోదీ

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు బూటకమే..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హనుమకొండ, మే 10 (విజయక్రాంతి): ‘నమో అంటే నరేంద్ర మోదీ కాదు.. నమ్మించి మోసం చేసే నేత.. ప్రధాని మోదీ ప్రియమైన వారు  కాదు. పిరమైన మోదీ. బీజేపీ అధికారంలోకి వచ్చాకే పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నయంటాయ’ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. 2014లో నరేంద్ర మోదీ నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి, పేద ప్రజల ఖాతాల్లో లక్షల కొద్దీ సొమ్ము జమ చేస్తానని మోసం చేశారన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ చెప్పిన మాటలు బూటకమేనని తేలిపోయిందన్నారు. కరీంనగర్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన బండి సంజయ్ ప్రజల కోసం ఏ మంచిపని చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయన దేశం కోసం.. ధర్మం కోసం.. అని చెప్పుకొంటూ పబ్బం గడుపుకోవడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. అంబానీ, అదానీకి చెందిన రూ.15 లక్షల కోట్ల రుణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందని మండిపడ్డారు. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆధునిక దేవాలయాలనుకునే ప్రాజెక్ట్‌లు నిర్మించారని గుర్తు చేశారు. ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.