వాల్మీకి స్కామ్‌లో టీ కాంగ్రెస్ నేతలు
- వారి పేర్లు బహిర్గతం చేయాలె
- దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నదెవరు
- రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలె
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): కర్ణాటకలో వాల్మీకి స్కామ్ తీగ లాగితే డొంకంతా తెలంగాణ కాంగ్రెస్ నేతల వైపు కదులుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కుంభకోణంలో రాష్ట్రంలోని కీలకమైన కాంగ్రెస్ నేతల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్ లో భారీగా అవినీతి జరిగిందంటూ సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో అంగీకరించటంతో స్కాంలో ఉన్న వారి పేర్లు బయటకు రావాల్సిన అవసరముందన్నారు.
తమ పార్టీ యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు దాదాపు రూ. 180 కోట్లు ప్రభుత్వ అకౌంట్ల నుంచి అక్రమంగా దారి మళ్లాయన్నారు. ఈ సొమ్ము అంతా ఎవరికీ ఖాతాలోకి బదిలీ అయిందో ప్రజలకు తెలియాలన్నారు. అందులో రూ. 45 కోట్లు హైదరాబాద్‌లోని 9 బ్యాంకు ఖతాలకు బదిలీ చేశారని ఆ బ్యాంక్ ఖాతాలు ఎవరివో తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ స్కాం బయటకు రాగానే వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరిండెంట్ సూసైడ్ చేసుకోవటం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఓ చానల్ పేరుతో ఉన్నబిజినెస్ సంస్థ కు రూ. 4.5 కోట్లు బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. అసలు ఆ సంస్థ యాజమాని ఎవరో ప్రజల ముందు ఉంచాలని, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బే తమ ఎన్నికల కోసం వినియోగించినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
అడ్డుకున్నదెవరు..
వాల్మీకి స్కాం వ్యవహారంలో హైదరాబాద్‌లో సిట్, సీఐడీ, ఈడీ దాడులు నిర్వహించినప్పటికీ ఆ సమాచారం మీడియాలో ప్రసారం కాకుండ అడ్డుకున్నదెవరని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా కీలకమైన కాంగ్రెస్ నేతలు కొంతమంది మీడియాను మేనేజ్ చేసినప్పటికీ మరో నాలుగైదురోజుల్లో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బార్లు, బంగారు దుకాణాల నుంచి భారీగా నగదు విత్ డ్రా చేసినట్లు సమాచారం ఉందని, వాటిని నడుపుతున్నెదవరు? వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధం ఏమిటని నిలదీశారు.
కర్ణాటక సీఎం సిద్దిరామయ్యను సీఎం పదవి నుంచి తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏమిటనీ ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య పెనవేసుకున్న బంధం ఈ వాల్మీకి స్కామేనన్నారు. ఈ స్కామ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలున్నట్లు పెద్ద ఎత్తున ఆధారాలు కనబడుతున్నప్పటికీ ఈడీ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని, ఇక్కడి నేతలు కాపాడుతున్న శక్తులెవరో ప్రజల ముందుంచాలన్నారు.
పార్లమెంట్ లో అవినీతిపై పెద్దఎత్తున మాట్లాడే రాహుల్ గాంధీ ఈ వాల్మీకి స్కామ్ లో ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. సొంత పార్టీ నేతలు అవినీతి చేస్తే మాఫీయేనా, వెంటనే రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందించి కుంభకోణంలో ఉన్న పెద్ద చేపల పేర్లు బయటకు చెప్పాల్సిన అవసరముందని పేర్కొన్నారు.






