17 May, 2026 | 5:56 AM

యూపీఏ పాలనలో ఐదు లక్షల కోట్ల స్కాం

26-08-2024 08:19 AM

బీఆర్‌ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో ఐదు లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని అనేక సంస్థలు చెప్పాయని బీఆర్‌ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పంచభూతాలను మింగిందని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ  కర్ణాటకలో వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతల పాత్ర ఉందన్నారు. కర్ణాటక మంత్రి నాగేంద్ర ప్రస్తుతం జైల్లో ఉన్నారని, వాల్మీకి సంస్థ డబ్బులను తెలంగాణ, ఏపీకి తరలించారని ఆరోపించారు.

వాల్మీకి సొసైటీలో రూ. 90 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో చెప్పా రని, అందులో తెలంగాణకు రూ. 45 కోట్లు  బదిలీ అయ్యాయని, ఏపీకి మరో రూ. 45 కోట్లు బదిలీ చేశారని పేర్కొన్నారు. డబ్బులు ఎవరికి చేరాయో  తెలపాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయని తెలిపారు. సీఎం సిద్ధరామయ్యను తప్పిస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జార్కోలి అన్నారని తెలిపారు. వాల్మీకి స్కామ్‌లో టీ కాంగ్రెస్ నేతల పాత్రను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వాల్మీకి స్కామ్ పై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.