హల్లల్లల్లో.. ఫుల్ జోష్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టించింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, తాజాగా మూడో సింగిల్ ‘హల్లల్లల్లో’ పాట కూడా అదే జోరును కొనసాగిస్తోంది. డిజిటల్‌గా విడుదలైన ఈ పాట అంచనాలకు మించి ఆదరణ దక్కించుకుంటోంది.
భారీ బీట్స్, డ్రమ్స్, జానపద శైలిలో సాగే రిథమ్‌తో ఏఆర్ రెహమాన్ ఈ పాటను మాస్ యాంథమ్‌లా తీర్చిదిద్దారు. మొదటి క్షణం నుంచే ఆకట్టుకునే ఈ ట్యూన్ ఆఖరి వరకు అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుంది. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం పాటకు మరింత మాస్ అప్పీల్‌ను తీసుకొచ్చింది. జానపదంతో కూడిన పదాలు పాటకు ప్రత్యేకమైన నేటివిటీని అందించాయి.
రక్షితా సురేశ్ తన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ పాటలో రామ్‌చరణ్, శృతి హాసన్, జాన్వీ కపూర్ ముగ్గురూ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. జూన్ 4న విడుదల కానుందీ సినిమా.






