1 August, 2026 | 8:53 PM

విష్ణుసాయి పాలీ క్లినిక్‌పై చర్యలు తీసుకోవాలి

01-08-2026 08:18 PM

* అర్హత లేని వ్యక్తితో వైద్య చికిత్సలు

* డిఎస్పీకి ఫిర్యాదు చేసిన  పీడీఎస్‌యూ నాయకుడు అల్తాఫ్ షేక్

అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలోని లింగాల రోడ్డులో ఉన్న విష్ణుసాయి పాలీ క్లినిక్‌లో అక్రమ వైద్య కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పీడీఎస్‌యూ నాయకుడు అల్తాఫ్ షేక్  అచ్చంపేట పోలీసు డిఎస్పి శ్రీనివాస్ కు  శనివారం ఫిర్యాదు చేశారు. క్లినిక్ నిర్వహణ, వైద్య సేవల చట్టబద్ధత, వైద్య సిబ్బంది అర్హతలు, వైద్య పరీక్షల నివేదికల ప్రామాణికత, రోగుల నుంచి వసూలు చేస్తున్న రుసుములు, వైద్య వ్యర్థాల నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేని వ్యక్తి వైద్యుడిగా వెంకటేష్ వ్యవహరిస్తూ అమాయక ప్రజలకు వైద్యం అందిస్తున్నారని ఆరోపించారు. స్వల్ప అనారోగ్యంతో వచ్చే రోగులను భయాందోళనలకు గురిచేసి తీవ్రమైన వ్యాధులు ఉన్నట్లు చెప్పి, ఒక ప్రైవేటు వైద్య పరీక్షల కేంద్రానికి పంపిస్తున్నారని తెలిపారు. అక్కడ తప్పుదారి పట్టించే వైద్య నివేదికలు ఇచ్చి, వాటి ఆధారంగా అవసరం లేని యాంటీబయాటిక్ మందులు, ఇంజెక్షన్లు, సెలైన్‌లు ఎక్కిస్తూ రూ. వేలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

క్లినిక్‌లో వైద్య వ్యర్థాల నిర్వహణ నిబంధనలు పాటించడం లేదని, అక్కడ పనిచేస్తున్న సహాయ వైద్య సిబ్బందికి అవసరమైన అర్హతలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. ఈ విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా పోలీసు అధికారి తదితరులకు కూడా ఫిర్యాదులు అందజేసినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఈ అంశంపై అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అల్తాఫ్ షేక్ డిమాండ్ చేశారు. ఫిర్యాదుపై డి.ఎస్.పి స్పందించి, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.