2 June, 2026 | 5:17 PM

ఉసిరికాయలపల్లిలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

02-06-2026 04:16 PM

జాతీయ జెండాను ఎగురవేసిన సర్పంచ్ వరలక్ష్మి రాజు

కారేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వరలక్ష్మి రాజు తెలంగాణ జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకొని వారికి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వరలక్ష్మి రాజు మాట్లాడుతూ, దశాబ్దాల పోరాటం, వేలాది మంది త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణాభివృద్ధి, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న భారతదేశ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిందని, ప్రతి ఏడాది ఈ రోజును రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా జరుపుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల త్యాగాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమం అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.