తెలంగాణ ఎమ్మెల్యే.. ఏపీలో చెక్కుల పంపిణీ
- కర్నూల్‌లో లబ్ధిదారులకు అందజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
- ఎమ్మెల్యే తీరు పట్ల ప్రజల్లో అసహనం
అలంపూర్, ఏప్రిల్ 4: అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడు శనివారం తన నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన చెక్కులను ఏపీలోని కర్నూల్‌లో పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మా రింది. అలంపూర్ నియోజకవ ర్గంలో పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి.
వాటి ని ఏపీలోని కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే విజయుడు పంపిణీ చేశారు. ఈ చెక్కులను తీసుకునేందుకు అలంపూర్ ప్రజలు కర్నూలుకు తరలివెళ్లారు. మండుటెండలో అవస్థలు పడుతూ వెళ్లారు.
కర్నూలు నుంచే కార్యకలాపలు
ఎమ్మెల్యేగా విజయుడు గెలిచి రెండున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్నా తన కార్యకలాపాలను మొత్తం ఏపీలోని కర్నూల్ పట్ట ణంలో ఉన్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డికి చెందిన చల్లా కాంపౌండ్ వేదికగా కొనసాగించడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా ప్రభుత్వానికి సం బంధించిన పథకాలను లబ్ధిదారుల తీసుకోవాలంటే వారు వ్యయప్రయాసాల నడుమ కర్నూల్ వెళ్లాల్సిందే.
గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం ప్రతి నియోజకవర్గంలో కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలను ని ర్మించింది. అలంపూర్‌లోనూ కార్యాలయం ఉన్నా ఎమ్మెల్యే విజయుడు మాత్రం దానివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కర్నూల్ కేంద్రంగానే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. బార్డర్ దాటి కర్నూల్ పోవాలంటే అలంపూర్ ప్రజలు అవస్థలు పడుతున్నారు.




