బిలోలి కోర్టుకు హాజరైన తెలంగాణ ఎమ్మెల్యేలు
2010లో బాబ్లీ వద్ద జరిగిన ఆందోళన కేసులో హాజరు
కరీంనగర్ సిటీ, ఏప్రిల్ 23 (విజయక్రాం తి) : తెలంగాణ రైతుల భూములకు సాగు నీటి కోసం మహారాష్ట్రలోని బాబ్లీ -ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు మంగళవారం మహారాష్ట్రలోని బిలోలి సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, విజయరమణా రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు హనుమంతు షిండే, కేఎస్ రత్నం కోర్టుకు హాజరయ్యారు.
మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మించి నీళ్లు రాకుండా అడ్డుకోవడంతో 2010లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు భారీ ఆందోళనకు దిగారు. బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే వరకు కదలమని కూర్చోవడంతో మహారాష్ట్ర పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో పోలీసులు చంద్రబాబు తో సహా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో గంగుల కమలాకర్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా, విజయరమణా రావు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ కేసు విచారణలో భాగంగానే వారు కోర్టుకు హాజరయ్యారు.






