లలితకళలకు కేంద్రం తెలుగు వర్సిటీ
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు
- బాచుపల్లిలో వర్సిటీ ప్రాంగణం ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (విజయక్రాంతి): లలితకళా రంగాల ఉపాధి కేంద్రంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వర్ధిల్లుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయ న బాచుపల్లిలో వర్సిటీ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి మాట్లాడారు.
లలితకళా రంగాల్లో తెలుగు వర్సిటీ ఎనలేని ఖ్యాతిని గడించిందన్నారు. వర్సిటీ కారణంగా వందలాది మంది కళాకారులు కళలపై మక్కువ పెంచుకుంటున్నారని కొనియాడరాఉ. తెలు గు భాష, సాహిత్యం, లలిత కళల ఔన్నత్యాన్ని చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నదన్నారు.
సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి వర్సిటీకి అవసరమైన కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, సాంకేతిక పరికరాలను సమకూర్చుతామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి సాంస్కృతిక రంగానికి ఎనలేని సేవలందిస్తున్న శాంతా బయోటెక్ వ్యవస్థాపకు డు, పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ వరప్రసాద్‌రెడ్డికి 2023 వర్సిటీ పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పురస్కార గ్రహీత వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు వారి బలం, అస్తిత్వం పరిఢవిల్లాలంటే తెలుగు వర్సిటీ కలకాలం నిలిచి ఉండాలని ఆకాంక్షించారు. తనకు వృత్తిపరమైన విజయాల కంటే తెలుగు భాషకు, సాహిత్యానికి చేస్తున్న సేవలే సంతృప్తినిచ్చాయని స్పష్టం చేశారు. అనంతరం పురస్కారానికి అందిన నగదును వర్సిటీ అభివృద్ధికి విరాళంగా ప్రకటించారు.
అంతేకాదు.. వర్సిటీకి అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు రూ.కోటి విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య వెలుదండ నిత్యానందరావు, రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, మేడ్చల్ కలెక్టర్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ రాధిక, నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్‌రెడ్డి, పాల్గొన్నారు.






