21 June, 2026 | 12:28 AM

రూ.10.22 లక్షల కోట్లకు ఆటోమొబైల్ పరిశ్రమ

20-06-2024 01:36 AM

ముంబై, జూన్ 19: యుటిలిటీ, స్పోర్ట్స్ యుటిలిటీ వాహన (ఎస్‌యూవీ) విభాగం జోరుగా వృద్ధిచెందడంతో 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ 19 శాతం వృద్ధిచెంది రూ. 10.22 లక్షల కోట్లకు చేరిందని మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ ప్రిమస్ పార్టనర్స్ విడుదల చేసిన నివేదిక తెలిపింది.  ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్స్ అమ్మకాల పరిమాణం 10 శాతం, అమ్మకాల విలువ 19 శాతం వృద్ధిచెందినట్టు పేర్కొంది. యూవీ, ఎస్‌యూవీ విభాగంలో అమ్మకాల పరిమాణం 23 శాతం, ధరలు 16 శాతం పెరగడంతో మొత్తంగా టర్నోవర్ 39 శాతం పెరిగిందని విశ్లేషించింది.

సాధారణ ధరల పెరుగుదల, వినియోగదారులు ప్రీమియం మోడల్స్‌కు అప్‌గ్రేడ్‌కావడం, హైబ్రీడ్, ఆటోమ్యాటిక్‌కు షిఫ్ట్‌కావడం, సన్‌రూఫ్ పాపులర్‌కావడం, ఎలక్ట్రిక్ వాహనాలకు షిఫ్ట్‌కావడంతో ఈ విభాగంలో వాహనాల సగటు ధరలు పెరిగాయని కన్సల్టింగ్ సంస్థ వివరించింది. చాలామంద వినియోగదారులు యూవీలు, ఎస్‌యూవీలపై మొగ్గుచూపుతున్నారని ప్రిమస్ పార్టనర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ సింగ్ తెలిపారు. మరోవైపు పాసింజర్ వాహన విభాగంలో స్వల్ప ధరల పెరుగుదల ఫలితంగా అమ్మకాల పరిమాణం 9 శాతం తగ్గిందని, అమ్మకాల విలువ 4 శాతం క్షీణించిందని ప్రిమస్ వెల్లడించింది. ద్విచక్ర వాహన విభాగం అమ్మకాల పరిమాణం 10 శాతం, విలువ 13 శాతం చొప్పున వృద్ధి చెందినట్టు తెలిపింది. త్రిచక్ర వాహన విభాగం అమ్మకాల పరిమాణం 16 శాతం పెరగ్గా, అమ్మకాల విలువ 24 శాతం వృద్ధిచెందింది. వాణిజ్య వాహన విభాగం అమ్మకాల పరిమాణం 3 శాతం, అమ్మకాల విలువ 7 శాతం చొప్పున పెరిగింది.

మూడోస్థానంలో భారత్

వాహన విక్రయాల పరిమాణంలో చైనా, యూఎస్‌ల తర్వాత భారత్ మూడోస్థానంలో ఉన్నదని ప్రిమస్ నివేదిక వెల్లడించింది. అయితే ఆటోమొబైల్ అమ్మకాల విలువలో మాత్రం జపాన్, జర్మనీ వంటి దేశాలకంటే వెనుకబడి ఉన్నదని పేర్కొంది. పలు ధనిక దేశాలతో పోలిస్తే భారత్‌లో వాహనాల సగటు ధర తక్కువని తెలిపింది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమ అమ్మకాల పరిమాణంకంటే అమ్మకాల విలువ వేగంగా పెరుగుతున్నదన్నది. 

  • యూవీలు, ఎస్‌యూవీలకు భారీ డిమాండ్

టూవీలర్స్‌లో నంబర్‌వన్

టూ వీలర్స్ ఉత్పత్తిలో భారత్ నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని, గత ఏడాది 2 కోట్ల యూనిట్లు ఉత్పత్తి అయ్యాయని నివేదిక తెలిపింది. అమ్మకాల పరిమాణంలో 76 శాతం వాటాతో ద్విచక్ర వాహన పరిశ్రమ ఆధిపత్యంలో ఉండగా, అమ్మకాల విలువలో ఈ పరిశ్రమ వాటా 18 శాతంగా ఉన్నది.