పదేండ్ల బాలికకు అరుదైన వ్యాధి
- బోన్ మ్యారో ఎప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతున్న చిన్నారి
- చికిత్సకు రూ.20లక్షలు ఖర్చవుతుందన్న డాక్టర్లు
- ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు
సిద్దిపేట క్రైం, మార్చి 1 : ఆడి పాడే వయసులోఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. చికిత్స కోసం ఆ బాలిక తల్లిదండ్రులు స్థోమతకు మించి ఖర్చు చేశారు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. మెరుగైన వైద్యానికి రూ.20లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన బిట్ల పర్శరాములు, గీత దంపతుల కూతురు శ్రీనిధి (10) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది.
చలాకీగా ఉండే శ్రీనిధి ఐదు నెలలుగా బోన్ మ్యారో ఎప్లాస్టిక్ అనీమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. డాక్టర్ల సూచన మేరకు తల్లిదండ్రులు హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. చికిత్సకు అవసరమైన ఏటీజీ ఇంజక్షన్ ఇచ్చినప్పటికీ ఫలితం కనిపించలేదు. చికిత్స కోసం ఇప్పటి వరకు సుమారు రూ.8లక్షలు ఖర్చు అయ్యాయి. స్థోమతకు మించి ఖర్చు కావడంతో పర్శరాములు తనకున్న 18గుంటల భూమి కూడా అమ్మాడు. కాగా, డాక్టర్లు తప్పనిసరిగా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ చేయాలని సూచించారు.
బాలిక వెన్నుపూస గుజ్జు అభివృద్ధి చెందకపోవడంతో బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్సకు సంబంధించి దాతల కోసం ఎదురుచూస్తున్నారు. చికిత్సకు దాదాపు రూ.20లక్షల వరకు ఖర్చవుతుందని మనసున్న మహారాజులు ముందుకొచ్చి ఆర్థికసాయం అందించాలని శ్రీనిధి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
తమ కూతురు ప్రాణాలు కాపాడాలని దీనంగా అభ్యర్థిస్తున్నారు. 9652210740 నెంబర్ కు ఫోన్ పే, గూగుల్ పే చేయాలని కోరారు. ఇదిలా ఉండగా బాలిక అనారోగ్య విషయం తెలుసుకున్న సిద్దిపేటకు చెందిన హెల్పింగ్ హాండ్స్ సంస్థ సభ్యులు తమవంతుగా రూ.10వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.




