కౌలు రైతులను గుర్తించాలి
డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్
గజ్వేల్, మే 15: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు కౌలు రైతులను గుర్తించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోల్గూర్, పిడిచెడ్ గ్రామాలలో కౌలు రైతుల సర్వేను నిర్వహించారు.ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తించి ఎల్‌ఈసి కార్డులను మంజూరు చేయాలని కోరారు.
అదేవిధంగా ఎన్నికల హామీ ప్రకారం కౌలు రైతులకు రైతు భరోసాను అందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో అప్పటి ప్రభుత్వానికి కౌలు రైతులకు రైతు భరోసా నష్టపరిహారం చెల్లించాలని ఉత్తరం రాశాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కౌలు రైతులకు రైతు భరోసా పంట నష్టపరిహారము వ్యవసాయ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం విస్మరించిందన్నారు.
ముఖ్యమంత్రి మూడేళ్ల పాలనలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించలేదన్నారు. కౌలు రైతులను ప్రభుత్వము గుర్తించకపోవడంతో పంట నష్టపోయిన సమయంలో పరిహారము అందక కౌలు రైతులు మరింత అప్పుల పాలవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమము కోసము చర్యలు తీసుకోవాలన్నారు. భరోసా తో పాటు సన్న వడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి బిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు, మైసయ్య, తదితరులు పాల్గొన్నారు.






