పోచారం ఇంటి వద్ద ఉద్రిక్తత
- ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ నేతల యత్నం
- అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
- 11 మందిపై కేసులు నమోదు
- రూ.10 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): మాజీ స్పీకర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోచా రం నివాసానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రావడం, ఆయన పార్టీ మారిన విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ న్, నాయకులు మన్నె గోవర్ధన్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దూదిమెట్ల బాల్‌రాజు తదితరులు పోచా రం నివాసాని వెళ్లారు.
ఇంటిలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సీఎం రేవంత్‌రెడ్డి రాక సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం పట్ల పోలీసులు తీవ్రంగా పరిగణించారు. బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి ఎలా చేరుకున్నారని ఆరా తీశారు.
మాజీ స్పీకర్ నివాసం వద్ద జరిగిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. బీఆర్‌ఎస్ కార్యక ర్తలు పోచారం ఇంట్లోకి చొచ్చుకువస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్, సీఎం ముఖ్య భద్రతాధికారి గుమ్మి చక్రవర్తి అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వీడియోలను పరిశీలించారు. బాధ్యులైన పోలీసులపైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
బెయిల్‌పై విడుదల
పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్‌ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు మరో 11 మందిపై ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత 12 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరికి రూ.10 వేల పూచికత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు నమోదైన వారిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, కే వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దూదిమెట్ల బాలరాజు, అంజనేయగౌడ్, కడారి స్వామియాదవ్, తుంగ బాలు, డీ రాజు, కే జంగయ్య, వరికుప్పల వాసు, చత్తారి దశరథ్ ఉన్నారు.






