13 April, 2026 | 2:27 AM

బెంగాల్‌లో తారస్థాయికి ఉద్రిక్తతలు

28-08-2024 01:50 AM
  1. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘ఛాత్ర సమాజ్’ 
  2. జూడా హత్యాచార ఘటనపై ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి 
  3. నబన్నా అభియాన్ మార్చ్‌కు దూరంగా జూడాలు 
  4. విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా బెంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపు

న్యూఢిల్లీ, ఆగస్టు 27: కోల్‌కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలి హత్యా చార ఘటన బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తుంటే.. మరోవైపు పశ్చిమబంగ ఛాత్ర సమాజ్ స్టూడెంట్ యూనియన్ అధికార టీఎంసీకి కంటిమీద కునుకులేకుండా చేస్తోం ది. వైద్యురాలి హత్యాచార ఘటనపై కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపడు తున్నారు. తాజాగా ‘పశ్చిమబంగ ఛాత్ర సమాజ్’ కోల్‌కతాలో మంగళవారం నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ విద్యార్థి సంఘా న్ని ఇటీవలే నెలకొల్పారు.

రవీంద్ర భారతి వర్సిటీకి చెందిన విద్యార్థి ప్రబీర్‌దాస్, కల్యా ణి వర్సిటీకి చెందిన శుభాంకర్ హల్దర్, రవీంద్రముక్త వర్సిటీ సయన్ లాహిరి కలిసి ‘నబన్నా అభియాన్’ పేరుతో ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్నారు. తమ యూనియన్‌కు ఎలాంటి రాజకీయ పార్టీతో సబంధం లేదని, బాధితురాలి కుటుంబసభ్యులకు న్యాయం జరగడంతో పాటు నిందితుడకి ఉరిశిక్ష పడాలని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. 

బారికేడ్లను బద్దలుకొట్టే యత్నం..

మంగళవారం ఛాత్ర సమాజ్ మార్చ్ నేపథ్యంలో బెంగాల్‌లో భారీ బందోబస్తు నిర్వహించారు. దాదాపు 6వేల మందితో హావ్‌డా వంతెన వద్ద పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థులు బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించా రు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో నిరసనకారులు రాళ్లు రువ్వగా వారిపై పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ఇంటివద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారని.. వారిని విడిచిపెట్టాలని బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. తాము ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

మార్చ్‌కు దూరంగా వైద్య విద్యార్థులు..

హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న జూడాలు.. ‘నబాన్నా మార్చ్’కు దూరంగా ఉన్నారు. ఛాత్ర సమాజ్‌తో తమ కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. మిగతా విద్యార్థి సంఘాలు కూడా దూరంగా ఉన్నారు. అయితే ఛాత్ర సమాజ్‌కు బయటి నుంచి బీజేపీ మద్దతిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.  

కమిషనర్ పేరిట నిందితుడి బైక్!

ఈ కేసులో నిందితుడు వినియోగించిన బైక్.. పోలీస్ కమిషనర్ పేరిట రిజిస్టేషన్ అయి ఉండటంపై తీవ్ర దుమారం రేపుతోంది. కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీఐ ఆధా రాలు సేకరించే క్రమంలో నిందితుడు వినియోగించిన బైక్ కోల్‌కతా సీపీ పేరిట రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. ఈ విష యం బయటకు పొక్కడంతో విద్యార్థులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

‘నిందితుడిగా ఉన్న సంజయ్‌రాయ్ ఉపయోగించిన బైక్ సీపీ పేరిట రిజిస్టర్ అయిన మాట వాస్తవమే.. అయితే పోలీసులకు చెందిన ప్రతి వాహనం మొదట కమిషనర్ పేరిట రిజిస్టర్ అవుతాయి. ఆ తర్వాత ఆయా వాహనాలను పోలీసు విభాగాల్లోని యూనిట్లకు కేటాయిస్తారు’ అని స్పష్టం చేశారు. హత్యాచార ఘటనకు ముందు కోల్‌కతాలోని వ్యభిచార గృహాలకు నిందితుడు వెళ్లినట్లు దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు పోలీసు శాఖకు అనుబంధంగా పనిచేయడం.. అతడు వాడిన వాహనం కమిషనర్ పేరిట రిజిస్టర్ అయి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

బెంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపు..

హత్యాచార కేసులో మమతా ప్రభుత్వం వ్యవహరించిన తీరు, మంగళవారం ఛాత్ర సమాజ్ విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడం, లాఠీచార్జికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం బెంగాల్‌లో 12గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు విద్యార్థి సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నామని.. పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు పాల్గొనాలని కోరారు. అయితే బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌కు ఎలాంటి అనుమతి లేదని ప్రభుత్వ, అనుబంధ సంస్థలు ఎవరూ ఈ పాల్గొనవద్దని బెంగాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది.