20 May, 2026 | 3:46 AM

కార్మికులు కన్నెర్ర చేస్తే బస్సు చక్రాలు ఆగిపోతాయి

20-05-2026 01:43 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు

టీజీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ కౌన్సిల్ సమావేశం

ముషీరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేస్తే బస్సు చక్రాలు ఆగిపోవడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి రథ చక్రం కూడా ఆగిపోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజకీయ పార్టీలను అధికారంలో కూర్చొబెట్టే ప్రథమశక్తి ఆర్టీసీ కార్మికులదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పోకడలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రతి కార్మికుడికి ఊపిరి అందిస్తున్న సంఘం టీజీ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, ఏఐటీయూసీ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర విస్త్రతస్థాయి కౌన్సిల్ సమావేశం మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి వీఎస్టీ ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. 

బస్‌భవన్ నుంచి సమావేశ ప్రాంగణం వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్ బోస్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్ హజరయ్యారు. ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు కె.పద్మాకర్, అధ్యక్షులు ఎస్.బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న పాల్గొన్నారు. ఇటీవల సమ్మె నేపథ్యంలో బలన్మరణానికి పాల్పడిన డ్రైవర్ కె.శంకర్ సంతాపం తెలియజేస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. కార్మికులు కన్నెర్ర చేస్తే టాటా, బిర్లా, అంబానీ లాంటి వారు కూడా వారి కాళ్లవద్దకు రావాల్సిందేనని తేల్చి చెప్పారు.  ఆర్టీసీ ఉన్నంతకాలం ఎంప్లాయిస్ యూనియన్ ఉండాల్సిం దేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. ఆర్టీసీ జేఏసీగా ఏర్పడి కార్మికుల హక్కులను సాధించుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ, ముఖ్య ఉపాధ్యక్షులు వెంకన్నగౌడ్, డీ గోపాల్, ఉపాధ్యక్షులు, ఉప ప్రధాన కార్యదర్శులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు  తదితరులు హాజరయ్యారు.