27 July, 2026 | 11:58 AM

సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు

27-07-2026 11:25 AM

కరీంనగర్,జూలై27(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్‌లో శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన "గోమాత వైభవం" ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు, ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao) ముఖ్య అతిథిగా హాజరై భక్తులను ఆధ్యాత్మిక సందేశాలతో అలరించారు.కార్యక్రమం ప్రారంభానికి ముందుగా వరసిద్ధి వినాయక సేవా సమితి సభ్యులు చాగంటి కోటేశ్వరరావును ఘనంగా ఆహ్వానించి పూలమాలలు, శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన చేసిన ఆధ్యాత్మిక ప్రవచనం ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ, గోమాత భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి ప్రతీక అని, గోసంరక్షణ ప్రతి హిందువు ధర్మబద్ధమైన బాధ్యత అని పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయాలు, వేద సంస్కృతి, కుటుంబ విలువలు, మానవతా దృక్పథం, ధార్మిక జీవన విధానం గురించి ఆయన తనదైన శైలిలో వివరిస్తూ భక్తులను ఆలోచింపజేశారు.ధర్మాన్ని ఆచరించినప్పుడే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, నైతిక విలువలు పరిరక్షించబడతాయని చెప్పారు.

సనాతన ధర్మ విశిష్టతను దేశ విదేశాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ, లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగిస్తున్న చాగంటి వారి సేవలు అభినందనీయమని నిర్వాహకులు కొనియాడారు.ఆధ్యాత్మిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు వెయ్యి నుంచి పదిహేనువందల మంది వరకు భక్తులు హాజరై చాగంటి వారి ప్రవచనాలను భక్తిశ్రద్ధలతో ఆసక్తిగా ఆలకించారు. వైశ్య భవన్ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోగా, కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఎంతో ఘనంగా సాగింది.కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లు చేశారు. ప్రవచనం అనంతరం విచ్చేసిన ప్రతి ఒక్కరికీ అల్పాహారాన్ని అందించి ఆతిథ్యాన్ని చాటుకున్నారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన దాతలు, సేవా సమితి సభ్యులు, వాలంటీర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి ప్రతినిధులు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల సభ్యులు, నగర ప్రముఖులు, దాతలు, భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.