5 May, 2026 | 4:23 AM

ద్రవిడ పార్టీలకు చుక్కెదురు

05-05-2026 03:10 AM

తమిళనాట రాజకీయాల్లో పెను సంచలనం

డీఎంకే, అన్నాడీఎంకేకు అంతంతమాత్రం మద్దతు

వారి పాలనలో అవినీతి ఆరోపణలు, అంతర్గ విభేదాలకు విసిగిన ప్రజానీకం

టీవీకేకు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన తమిళులు

అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో సక్సెస్

విజయ్‌కి జైకొట్టిన జెన్‌జీ, మహిళా లోకం

చెన్నై, మే ౪: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు విజయ్ ఒక ఆశాకిరణంగా కనిపించారు.

తనకున్న భారీ ఫ్యాన్ బేస్‌ను ఓటు బ్యాంక్‌గా మార్చుకోవడంలో విజయం సాధించారు. ముఖ్యంగా యువత, మహిళలు టీవీకే వైపు మొగ్గు చూపడం ఈ ప్రభంజనానికి కారణమైంది. రాష్ట్రవ్యాప్తంగా 85 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడానికి విజయ్ చరిష్మానే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. డిజిటల్ పారదర్శకత, విద్యా వ్యవస్థ ఆధునీకరణపై ఆయన విజయ్ హామీలు యువతను కదిలించాయి. కేవలం సినిమాల పరంగానే కాకుండా ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడిగా ఆయన గుర్తింపు సాధించారు. నియోజకవర్గాలవారీగా టీవీకే చేసిన ప్రచారం కలసి వచ్చింది. మహిళల కోసం ప్రకటించిన ప్రత్యేక పథకాలు క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన పునాది వేశాయి.

టీవీకే ఘన విజయానికి కారణాలు

*సంప్రదాయ ద్రవిడ పార్టీలుగా పేరున్న డీఎంకే, అన్నాడీఎంకేను ప్రజలు అంతగా ఆదరించడం లేదనేది తాజా ఫలితాలతో తేలిపోయింది. రెండు పార్టీల పాలనలో అవినీతి ఆరోపణలు, అంతర్గత విభేదాలు పార్టీల పునాదులను దెబ్బతీశాయి. క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో ఆ పార్టీలు వెనుకబడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

*ఉద్యోగ కల్పన, పారదర్శక పాలన అందించడంలో డీఎంకే, అన్నాడీఎంకే విఫలమ య్యాయనే విమర్శలున్నాయి. ఉద్యోగ కల్పన, పారదర్శకత విషయంలో టీవీకే ఇచ్చిన హామీలను అక్కడి ప్రజలు విశ్వసించారు. విజయ్ ప్రకటించిన యువ -కేంద్రిత ఎజెండా ఓటర్లలో కొత్త ఆశలు రేకెత్తించింది. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో డీఎంకే, అన్నాడీఎంకే కంటే విజయ్ ముందంజలో నిలిచారు.

*విజయ్‌కి తమిళనాట ఉన్న చరిష్మా పార్టీకి అతిపెద్ద ప్లస్ పాయింట్. పార్టీ సాధించిన ఘన విజయంలో విజయ్ అభిమాన సంఘాలు క్షేత్రస్థాయిలో బలమైన పాత్ర పోషించాయి. ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పట్టణ, నగరస్థాయి వరకు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇది సంప్రదాయ పార్టీల బూత్ స్థాయి నెట్‌వర్క్‌ను దెబ్బతీసింది. 

*విజయ్ తన ప్రచార శైలిని చాలా ప్రత్యేకంగా రూపొందించుకున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవడం ఆయనకు కలిసి వచ్చింది. ఒక నటుడిగానే కాకుండా ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఈ విభిన్నమైన వ్యూహం టీవీకేను ఇతర పార్టీల కంటే ముందు వరుసలో నిలబెట్టింది.

*ముఖ్యంగా జెన్ జెడ్ నుంచి విజయ్‌కి అపూర్వ స్పందన లభించింది. మొదటిసారి ఓటు వేస్తున్న యువతీ యువకులు ఆయనకు మద్దతుగా నిలిచారు. కొత్త తరం ఓటర్లలో విజయ్ ఒక బలమైన నమ్మకాన్ని కలిగించారు. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను టీవీకే అద్భుతంగా వాడుకుంది. యువతను ఆకట్టుకునేందుకు ఆన్‌లైన్ ప్రచారాన్ని భారీ స్థాయిలో నిర్వహించింది. సంప్రదాయ మీడియా కంటే డిజిటల్ వేదికలపైనే విజయ్ ప్రచారం ప్రభావవంతంగా పనిచేసింది. 

*ఏ పార్టీతోనూ, ఎలాంటి పొత్తులు లేకుం డా ఒంటరిగా బరిలోకి దిగడం కూడా విజయ్‌కి కలిసి వచ్చింది. పొత్తులు లేకపోవ డంతో ఆయనపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది. తానే నిజమైన ప్రత్యామ్నాయం అని ప్రజలను నమ్మించడంలో ఆయన విజయం సాధించారు. ఈ ధైర్యవంతమైన పోరాటం విజయ్‌కు ప్రజల్లో మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

మ్యానిఫెస్టో హామీలకు ప్రజలు మొగ్గు

ఎన్నికల ముందు టీవీకే విడుదల చేసిన మ్యానిఫెస్టో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. 

మ్యానిఫెస్టోలో ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం, బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఐదెకరాలలోపు సాగు భూమి ఉన్న రైతులకు రుణమాఫీ 

విద్యార్థుల చదువు కోసం ఏటా రూ.15,000 చొప్పున సాయం 

నిరుద్యోగ యువతకు నెలకు రూ.2,000 చొప్పున భృతి 

పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు 

ప్రైవేట్ రంగంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. 

పేద కుటుంబాలకు చెందిన యువతుల పెండ్లికి 8 గ్రాముల బంగారం కానుక