4 March, 2026 | 6:02 AM

శిష్యుడిగా అదే గొప్ప ఆనందం

04-03-2026 12:40 AM

స్టార్ హీరో నాని నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇటీవల ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ను విడుదల చేయగా, విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన చెప్పిన సినిమా విశేషాలివీ.. 

* నేను దసరా సినిమాకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశా. అప్పుడే శ్రీకాంత్ ఓదెల ‘నువ్వు  కొరియోగ్రాఫర్ అయితే కచ్చితంగా నేను సాంగ్ ఇస్తా’ అన్నారు. నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి అని నిర్ణయించుకున్న తర్వాత మొదట కలిసిన వ్యక్తి డైరెక్టర్ శ్రీకాంత్. నాని ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ చేస్తున్నారు. శ్రీకాంత్ గొప్ప విజన్‌తో సినిమా తీస్తున్నారు. ఇప్పటివరకు నాని చేసిన అన్నిట్లో కంటే ఒక పీక్‌లోకి వెళ్లేలా ‘-ఆయా షేర్’ సాంగ్ ఉండాలని శ్రీకాంత్ స్పష్టంగా చెప్పారు. 

* ఈ సాంగ్‌కు న్యాయం చేయాలని తపనతో నిరంతరం పనిచేశా. ఇందులో మూమెంట్స్ అన్నీ నాని క్యారెక్టర్‌లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ క్యారెక్టర్‌కు జడ ఉంది. ఆ జడ పట్టుకుని ఒక మూమెంట్ చేయాలనే ఆలోచనతో చేసిన స్టెప్ అది.  

* నానితో జర్నీ దసరా సినిమా నుంచి మొదలైంది. నేను కొరియోగ్రాఫర్ అయిన తర్వాత నానితో సాంగ్ చేయాలని ఉండేది.. కానీ, ఆ కోరిక నా తొలి సినిమాతోనే తీరడం చాలా ఆనందంగా వుంది. హుక్ స్టెప్ కోసం మూడు రోజులు రిహార్సల్స్ చేశాం. నాని దాదాపు మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేశారు. ఆ సమయంలో ఆయన భుజానికి చిన్న గాయం కూడా ఉంది. ఒక్క నిమిషం కూడా నాకు ఇది కష్టంగా ఉందని చెప్పలేదు.   

* ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సాంగ్ -చూసి, ఫోన్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ‘ఇండస్ట్రీలో శిష్యుడుగా నీ పేరు చెప్తా’ అన్నారు. శిష్యుడిగా అంతకు మించిన ఆనందం నాకు మరొకటి ఉండదు.