02-07-2025 12:00:00 AM
నితిన్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను హీరోయిన్ సప్తమిగౌడ మీడియాతో పంచుకున్నారు.
“-కాంతార’ తర్వాత ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ ఇచ్చా. ఓకే అయ్యాక హార్స్ రైడింగ్ నేర్చుకోమని చెప్పారు. అంబరగొడుగు అనే ఊరిలో రత్న అనే అమ్మాయి పాత్ర నాది. తను పవన్‌కళ్యాణ్ అభిమాని. నా క్యారెక్టర్‌కు ఒక డిఫరెంట్ లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. ‘కాంతార’తో చూస్తే లుక్‌వైజ్ నా క్యారెక్టర్ ఒకేలా ఉందనిపించవచ్చు. కానీ, క్యారెక్టర్‌గా చూస్తే పూర్తిగా భిన్నమైనది. ఇది కొంచెం సీరియస్ సబ్జెక్ట్.. వినోదం పంచే పాత్ర నాది.
కొండలు, గుట్టల్లో హార్స్ రైడింగ్ చేయాల్సివచ్చింది. రోజూ మూడు, నాలుగు గంటలు హార్స్ రైడింగ్‌తో ఇబ్బందిపడ్డా. కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయనే సంతృప్తి ఉంది. ఈ సినిమా నటిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. మిగతా వాటి కంటే రత్న క్యారెక్టర్ రాసేటప్పుడు ఎంజాయ్ చేశానని డైరెక్టర్ చెప్పేవారు. సినిమాల్లో హీరోతో ఆడిపాడే హీరోయిన్ క్యారెక్టర్స్ చూస్తుంటాం. కానీ ఇందులో ఫైట్ చేసే హీరోయిన్స్‌ను చూస్తారు.
ఉమెన్ క్యారెక్టర్స్‌ను ఇంత బలంగా తెరకెక్కించినందుకు రేపు థియేటర్లలో ‘తమ్ముడు’ సినిమా చూసే మహిళా ప్రేక్షకులు చాలా ఆనందపడతారు. దిల్ రాజు ఎస్‌వీసీ సంస్థలో నా ఫస్ట్ తెలుగు సిని మా చేయడం సంతోషంగా ఉంది. ‘పుష్ప’లో రష్మిక లాంటి పాత్ర వస్తే చేసేందుకు సిద్ధం.
‘కాంతార’ సక్సెస్ తర్వాత మళ్లీ అలాంటి పాత్రలే ఆఫర్ చేశారు. అలా చాలా సినిమాలు వదులుకున్నా. ప్రస్తుతం తెలుగు లో మరో రెండు చిత్రాలతోపాటు తమిళం, కన్నడలో సినిమాలు చేస్తున్నా. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తా. అన్ని భాషా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా” అని తెలిపింది.