యూకే పాఠ్యాంశాల్లో భ్రమయుగం
మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘భ్రమయుగం’కు అరుదైన ఘనత దక్కింది. ఈ చిత్రం యూకే ఫిల్మ్ స్కూల్ పాఠ్యాంశాల్లో చోటు దక్కించుకుంది. ఈ సినిమాను కేస్ స్టడీ చేస్తుండటం విశేషం. హాలీవుడ్ చిత్రం ‘హారీ పోటర్’ సిరీస్ చిత్రాలతో ‘భ్రమయుగం’ చిత్రాన్ని పోలుస్తూ సౌండ్ డిజైన్ విభాగంలో పాఠాలు చెప్పడం విశేషం.
సంబంధిత దృశ్యాలను ఓ స్టూడెంట్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దానిని భ్రమయుగం దర్శకుడు రాహుల్ సదాశివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అభిమానులతో రాహుల్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సినిమా ఒక పిరియాడిక్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో రూపొందింది. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
వసూళ్లు కూడా భారీగానే సాధిం చింది. తాంత్రిక విద్యలు నేర్చుకున్న మంత్రగాడి బారి నుంచి ఓ యువకుడు తనను తాను ఎలా రక్షించుకున్నాడన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. కుల వివక్ష, అధికారం మనిషిని ఎలా రాక్షసుడిగా మారుస్తుందన్న విషయాలను ఈ చిత్రంలో అంతర్లీనంగా చర్చించారు.






