26 April, 2026 | 8:26 AM

మూసీ అభివృద్ధే లక్ష్యం

13-08-2024 01:09 AM

సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): దక్షిణ కొరియా రాజధాని సియోల్ నడిబొడ్డున ప్రవహించే చుంగ్‌గేచంగ్ నది పరిసరాలను సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి చుంగ్‌గేచంగ్ నదిని ప్రపంపస్థాయి వాటర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దిన తీరుతెన్నులను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ నది సుందరీకరణ జరిగిన విధానాన్ని గమనించిన తర్వాత మూసీ డెవలప్‌మెంట్‌పై అనేక ఆలోచనలకు అవకాశం ఇచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు. దాదాపు 11 కిలోమీటర్ల ఈ నది గతంలో విపరీతమైన కలుషితాలతో ఉండేది. 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రివర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దిన తర్వాత సియోల్ నగరవాసులే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి ఏటా దాదాపు 19 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు.