26 March, 2026 | 2:51 AM

శ్రీరామనవమి మహోత్సవ ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలి

26-03-2026 12:25 AM

కలెక్టర్ అంకిత్

భద్రాచలం, మార్చి 25, (విజయక్రాంతి): శ్రీరామనవమి మహోత్సవాల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్ల పనులను సమర్థవంతంగా, సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మృణాల్  శ్రేష్ఠతో కలిసి  వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్య, విద్యుత్, రహదారులు, ఇరిగేషన్ తదితర శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన రక్త నిల్వలు (బ్లడ్ ప్యాకెట్లు), అవసరమైన మందులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని హెలిప్యాడ్ ఏర్పాట్లు, బారికేడింగ్ తదితర పనుల పురోగతిని సమీక్షించారు. విద్యుత్ శాఖ అధికారులు ముందస్తుగా అన్ని లైన్లను తనిఖీ చేసి ఎటువంటి లూజ్ కనెక్షన్లు లేకుండా నిశితంగా పరిశీలనలు చేపట్టాలని సూచించారు.

మహోత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు, వీఐపీలు విచ్చేసే అవకాశం ఉన్నందున దేవస్థానం పరిసర ప్రాంతాల్లోని అన్ని సెక్టార్లలో 24 గంటల పాటు సురక్షితమైన తాగునీటి సరఫరా నిరంతరంగా అందించడంతో పాటు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గోదావరి స్నాన ఘాట్ల వద్ద భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, హెచ్చరిక బోర్డులు, బారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు గజతగాళ్లు (స్విమ్మర్లు) అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీరామనవమి మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందు కు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపుని చ్చారు.  ఈ సమావేశంలో శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.