ఉగ్ర కుట్ర కేసులో హైదరాబాద్ మహిళ!
- అరెస్టు చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు
- విజయవాడ నెట్వర్క్‌తో సైదా బేగంకు లింకులు
- అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్
- ఏడు రాష్ట్రాల్లో కార్యకలాపాలకు గ్యాంగ్ స్కెచ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 25 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు కుట్రలు పన్నుతున్న ముఠా గుట్టును కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. విజయ వాడ కేంద్రంగా ఈ ముఠా సాగిస్తున్న కార్యకలాపాలకు హైదరాబాద్‌కు చెందిన సైదా బేగంకు లింకులు ఉండటంతో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయ వాడ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా యువతను ఆకర్షించి, ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా నెట్వర్క్ నిర్మించడమే ఈ ముఠా ప్రధాన లక్ష్యం. ఈ ముఠా కార్యకలాపాలు అత్యంత రహస్యంగా, సాంకేతిక పరిజ్ఞానంతో సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు ఇన్ స్టాగ్రాంలో అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో ఒక రహస్య గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు.
ఈ గ్రూప్ ద్వారానే సభ్యులతో చర్చలు జరపడం, కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడం వంటివి చేస్తున్నారు. 2025 జూన్ నెలలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన తర్వాత సయిదా బేగం బృం దం మరింత అప్రమత్తమైంది. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూనే తమ నెట్వర్క్‌ను విస్తరించారు. ఈ గ్రూపులో సోహైల్ బేగ్, షరీఫ్, డానిష్లతో పాటు సుమారు 12 మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం.
వించిపేట నుంచి హైదరాబాద్ వరకు
విజయవాడలోని వించిపేటలో సోమవారం అర్ధరాత్రి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధి కారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉగ్రవాద సంస్థలకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సొహైల్ బేగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించగా, హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం ఈ వ్యవహారంలో కీలకమని తేలింది. వెంటనే హైదరాబాద్‌లో ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద ఉన్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన ముఠా
ఈ గ్యాంగ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా తన కార్యక లాపాలను నిర్వహించేందుకు సిద్ధమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ ముఠాకు సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా బీహార్‌కు చెందిన దిల్కాష్ అనే వ్యక్తి ఈ గ్యాంగ్‌లో మరో కీలక సభ్యుడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసకర చర్యలకు వీరు ఏవైనా పథకాలు రచించారా.. అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.




