25 March, 2026 | 3:05 AM

ఏటీఎం ఏర్పాటుకు ఎదురుచూపు!

25-03-2026 12:47 AM

ఏటీఎం లేక ఇబ్బందులు పడుతున్న వైనం

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మార్చి24: సూర్యాపేట - జనగామ 365(బీ), నకిరేకల్ - తానంచర్ల రెండు జాతీయ రహదారులకు ప్రధాన కూడలి అయిన అర్వపల్లిలో ఏటీఎం(ఆటోమేటిక్ టెల్లర్ మిషన్) లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.కనీసం ఇక్కడ ప్రధాన వాణిజ్య బ్యాంకు కూడా లేదు.గతంలో ఇక్కడ రెండు ప్రైవేటు ఏటీఎంలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ సరిగ్గా లేక మూసివేశారు.దీంతో ప్రజలు డబ్బులు అత్యవసరమైన సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. జాజిరెడ్డిగూడెం ఎస్బీఐ ఆధ్వర్యంలో అర్వపల్లి సెంటర్లో ఏటీఎం ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా స్థానికులు పోరాడుతున్నారు.

నిత్యం వేలాదిమంది రాకపోకలు..

రెండు జాతీయ రహదారులకు ప్రధాన కూడలి అయిన అర్వపల్లికి నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా చుట్టుపక్కల మండలాలకు అర్వపల్లి ప్రధాన కూడలి, ఆయా మండలాల ప్రజలు కూడా ఇక్కడి నుంచి వెళ్తుంటారు.కానీ డబ్బులు అత్యవసరం అయిన సమయంలో ఏటీఎం లేక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రం సూర్యాపేటకు వెళ్లాల్సి వస్తుంది.ఇప్పటికైనా బ్యాంకింగ్ అధికారులు అర్వపల్లిలో ఏటీఎంలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

ఏటీఎం లేక తీవ్ర ఇబ్బందులు

అర్వపల్లిలో ఏటీఎంలు లేక నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.డబ్బులు అత్యవసరమైతే బ్యాంకులు అందుబాటులో లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని గతంలో అధికారులకు అనేకసార్లు విన్నవించాం. వెంటనే బ్యాంకింగ్ ఉన్నతాధికారులు ఏటీఎం ను ఏర్పాటు చేయాలి.

 - ఖమ్మంపాటి జగన్, వేల్పుచర్ల గ్రామం