2 August, 2026 | 1:05 AM

ప్రేక్షకుల అంచనాలు నన్ను ఉత్సాహపరుస్తాయి!

02-08-2026 12:00 AM

బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి డిమ్రీ.. తన సినీ ప్రయాణం గురించి సంచలన విషయాలను పంచుకుంది. “నేనెప్పుడూ ఎలాంటి ఫార్ములాను నమ్ముకోలేదు. కేవలం సినిమాపై ఉన్న అమితమైన ఇష్టంతోనే ముందుకు సాగుతున్నా.

ప్రతీ ప్రాజెక్ట్, నేను ఎదుర్కొన్న సవాళ్లు, నేర్చుకున్న పాఠాలే నన్ను ఈరోజు ఒక పరిపూర్ణ నటిగా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం చాలా మంది దర్శకులు వైవిధ్యమైన కథలతో నా దగ్గరకు వస్తుండటం ఆనందంగా ఉంది. అయితే, కథ ఎంత పెద్దదైనా, రోజు చివరికి నాకు కథ, ఆ పాత్రతో కనెక్షన్ కుదరడం అత్యంత ముఖ్యం. మొదటి నుంచి నాలో మారని ఏకైక విషయం ఇదే. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కావడం గురించి నేను పెద్దగా ఆలోచించను.

మనసుకు హత్తుకునే, నన్ను సవాలు చేసే పాత్రల వైపే నేను ఆకర్షితురాలినవుతా. వివిధ రకాల విభిన్నమైన పాత్రలను పోషించడం వల్ల ప్రేక్షకుల నుంచి వచ్చే అంచనాలు నాకు భయం కలిగించవు. అవి నన్ను మరింత ఉత్సాహపరుస్తాయి. ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకమే ప్రతిరోజూ ఉత్తమంగా పనిచేసేలా ప్రేరణనిస్తుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తూ ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చే కథలలో భాగం కావడమే నా లక్ష్యం” అని చెప్పుకొచ్చింది త్రిప్తి డిమ్రీ.