1 August, 2026 | 11:04 PM

రోడ్డు భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత

01-08-2026 10:08 PM

ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి

భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

రోడ్డు భద్రత లో భాగంగా  జిల్లా కేంద్రంలో ప్రత్యేక తనిఖీలు 

 50 వాహనాలు స్వాధీనం

భూపాలపల్లి,(విజయ క్రాంతి): రోడ్డు భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతని ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న “సురక్షితంగా చేరుకుందాం” ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు, డ్రైవింగ్ అనుమతిపత్రం, తలరక్షక టోపీ (హెల్మెట్), సీటు బెల్ట్ వినియోగం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్. లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, ఇతర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన 50 వాహనాలను స్వాధీనం చేసుకొని చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రతి ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడమే ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ప్రమాణిత తలరక్షక టోపీ ధరించాలని, సీటు బెల్ట్ వినియోగించాలని, నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.

రోడ్డు భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ, ట్రాఫిక్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిటిఓ శ్రీనివాస్, భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు, భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.