1 August, 2026 | 11:01 PM

దివ్యాంగుల సదరం ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి

01-08-2026 10:02 PM

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దివ్యాంగులకు అవసరమైన సదరం వైకల్య ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సదరం ధృవీకరణ పత్రాల జారీకి సగటున 75 రోజుల సమయం పడుతుందని, ఈ సమయాన్ని 30 రోజులకు తగ్గించేలా అన్ని జిల్లాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు తెలిపారు. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, సమయపాలనతో సేవలు అందించాలని, గిరిజన, మారుమూల, దూర ప్రాంతాలలో నివసించే దివ్యాంగుల సౌకర్యార్థం మండల స్థాయిలోనే ప్రత్యేక సదరం వైద్య శిబిరాలను నిర్వహించాలని, దివ్యాంగులకు స్థానికంగానే వైద్య పరీక్షలు నిర్వహించి ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.

గిరిజన ప్రాంతాల నుంచి జిల్లా ఆసుపత్రులు, సదరం కేంద్రాలకు రాలేని దివ్యాంగులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు చేయూత, అడ్మిన్ ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వ సేవలు వారి వద్దకే చేరే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్.టి.సి.–సదరం కేంద్రం పునరుద్ధరణ పనుల కోసం 43 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే ఆ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ నిధులతో సదరం సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించబడతాయని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగ చిన్నారులందరికీ 100 శాతం సదరం ధృవీకరణ పత్రాలు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని, దివ్యాంగ పిల్లలకు సకాలంలో ధృవీకరణ పత్రాలు అందితే విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన, మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న దివ్యాంగులకు సేవలు మరింత చేరువయ్యేలా మొబైల్ మెడికల్ బృందాల ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించి, దరఖాస్తుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తామని తెలిపారు. జిల్లాలో సదరం ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా ప్రతి అర్హుడికి ధృవీకరణ పత్రం అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఎం రామకృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.