18 July, 2026 | 12:23 AM

‘వెట్టి’ నిషేధం ఓ ఎత్తుగడ

18-07-2026 12:00 AM

భారత ప్రభుత్వం జూలై 13న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. వెట్టిచాకిరీతో చేసిన వస్తువుల దిగుమతులను నిషేధిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. నిజానికి ఈ నిర్ణయం కేంద్రం సొంతంగా తీసుకున్న నిర్ణయమేమీ కాదు. పరోక్షంగా అమెరికా చేస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో చేసిన ఒక ప్రకటన మాత్రమే. అమెరికా వాణిజ్య విభాగం త్వరలో ఒక కార్యాచరణ అమలు చేయనున్నది. ఆ కార్యాచరణ అమలైతే.. భారతీయ ఎగుమతులపై 12.5 శాతం అదనంగా సుంకాలు పడే ప్రమాదం ఉంది.

వెట్టిచాకిరీతో ముడిసరుకు తయారు చేసే దేశాల నుంచి అమెరికా వస్తువులను కొనదు. ఎందుకంటే తక్కువ ధరకు దొరికే ఇలాంటి వస్తువులతో తయారయ్యే ఉత్పత్తుల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ ధరలతో అమెరికా కంపెనీలు ఏమాత్రం పోటీ పడలేవు. అందుకే అమెరికా ఈ నిబంధనలను పెట్టింది. వెట్టిచాకిరీ అనేది ఒక రకమైన ఎగుమతి రాయితీ లాంటిది. ప్రపంచంలోనే అత్యంత దారుణంగా శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికుల కష్టంపై ఈ దుర్మార్గం సాగుతున్నది.

ఒకసారి అమెరికా సుంకాల పట్టిక చూస్తే ఈ విషయమే స్పష్టంగా తెలుస్తుంది.  అమెరికా ఇప్పటికే ఈయూ, పాకిస్థాన్, మెక్సికో, కెనడా, ఇండోనేషియాకు 10 శాతం సుంకాలు ప్రతిపాదించింది. మన దేశంలో అలాంటి నిషేధ చట్టం లేకపోవడంతో అమెరికాకు 12.5 శాతం సుంకం చెల్లించాల్సి వస్తున్నది. ఆ తక్కువ సుంకం చెల్లిస్తున్న దేశాల జాబితాలో చేరేందుకు భారత్ ప్రస్తుతం ఉవ్విళ్లూరుతున్నది. దీనిలో భాగంగానే తాజాగా వెట్టిచాకిరీతో చేసిన వస్తువుల దిగుమతులను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

తద్వారా మున్ముందు కొన్ని వస్తువులను నిషేధించే అధికారాన్ని తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయానికి సంబంధించిన ఆనుపానులు, నియమ నిబంధనలు ఇప్పటికి ఖరారు కాలేదు. తప్పు చేసే వారిని ఏరివేస్తున్నట్లు రుజువు చూపిస్తేనే అమెరికా సుంకాలకు మినహాయింపు ఇస్తుంది. లేదంటే భారత్‌పై అదనపు సుంకాలు ఖాయం. అమెరికానే భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్.

భారత్ నుంచి ఎక్కువగా అగ్రరాజ్యానికి వస్త్రాలు, రత్నాలు, మెడిసిన్ ఇంజినీరింగ్ వస్తువులు ఎగుమతి అవుతాయి. ఆయా రంగాల్లో లాభాలు తక్కువే అయినప్పటికీ ఎగుమతులు జోరుగా ఉంటాయి. మెక్సికో, ఇండోనేషియా వంటి దేశాలతో పోలిస్తే మనకు 2.5 శాతం మేర సుంకం అదనంగా ఉంటుంది. ఈ చిన్న వ్యత్యాసం వల్ల వాణిజ్య ఒప్పందాలు వేరే దేశాలకు తరలిపోయే ప్రమాదం ఉంది.